Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు ప్రారంభం, అంతకుముందు ఈయూలో సభ్యత్వం కల్పించాలని కోరిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ వీకెండ్ క‌ర్ఫ్యూ ఎత్తివేత
Russian and Ukraine flags (Photo Credits: Pxhere/Pixabay)

New Delhi, February 28: ఉక్రెయిన్‌కు వెంటనే యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ (Ukrainian President Volodymyr Zelenskyy) సోమవారం అభ్యర్థించారు. రష్యా దురాక్రమణ నేపథ్యంలో ప్రత్యేక విధానం ద్వారా ఐరోపా కూటమిలో సభ్యత్వం కల్పించాలని ఆయన కోరారు. ఈ మేరకు జెలెన్‌స్కీ సోమవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

‘కొత్త ప్రత్యేక విధానం ద్వారా ఉక్రెయిన్‌ను తక్షణమే చేర్చుకోవాలని యూరోపియన్ యూనియన్‌కు (Immediate Membership of European Union) మేం విజ్ఞప్తి చేస్తున్నాం. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది మా లక్ష్యం. ముఖ్యంగా సమాన హోదా కలిగి ఉండటం. ఇది న్యాయమైనదని నేను అనుకుంటున్నాను. ఇది సాధ్యమవుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను’ అని అన్నారు.

బెలారస్‌లోని ఫ్యాఫిట్‌ వేదికగా ఉక్రెయిన్‌-రష్యా బృందాల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల కోసం ఉక్రెయిన్‌ తరఫున ఆ దేశ రక్షణశాఖ మంత్రి హాజరయ్యారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌.. రష్యా తక్షణమే యుద్ధం (Russia-Ukraine War) విరమించుకోవాలని డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు నాటోలో ఉక్రెయిన్‌ చేరబోమని లిఖితపూర్వక హామీ ఇ‍వ్వాలని రష్యా కోరుతున్నట్టు సమాచారం.

5వ రోజుకు చేరిన ఉక్రెయిన్ రష్యా యుద్ధం, నేడు ఐరాస జనరల్‌ అసెంబ్లీ అత్యవసర సమావేశం, ఓటింగ్‌కు భారత్‌, చైనా, యూఏఈలు దూరం, స్విఫ్ట్‌ నుంచి రష్యా ఔట్‌

అంతకు ముందు రష్యా బలగాలను ఉద్దేశించి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ మాట్లాడుతూ.. మీ ప్రాణాలు కాపాడుకోండి లేదంటే ఉక్రెయిన్‌కు వదిలి వెళ్లిపోండి అంటూ వారిని హెచ్చరించారు. తమ దేశ రక్షణ కోసం ప్రతీ పౌరుడు ఓ యోధుడిలో పోరాడుతున్నారని ప్రశంసించారు. ఈ యుద్ధంలో 4,500 మంది రష్యా సైనికులు మృతి చెందినట్టు జెలెన్‌ స్కీ వెల్లడించారు. మరోవైపు కీవ్‌లో పరిస్థితులు కంట్రోల్‌లోనే ఉన్నట్టు ఉక్రెయిన్ ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులతో మృత్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ దాడుల్లో మొత్తం 102 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి (UN) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నట్టు వెల్లడించింది.

249 మంది ప్రయాణికులతో బుకారెస్ట్‌ నుంచి ఢిల్లీకి చేరిన ఐదో విమానం, కొనసాగుతున్న భారతీయుల తరలింపు ప్రక్రియ, ఉక్రెయిన్‌లో 13వేల మంది భారతీయులు

కీవ్ న‌గరాన్ని స్వాధీనం చేసుకోవ‌డానికి ర‌ష్యా దాడులు చేస్తోన్న నేప‌థ్యంలో ఉక్రెయిన్ వీకెండ్ క‌ర్ఫ్యూ విధించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు, భార‌త విద్యార్థుల‌ను ఉక్రెయిన్ నుంచి త‌ర‌లించ‌డానికి భార‌త ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. కర్ఫ్యూ ఎత్తివేసిన‌ట్లు భార‌త దౌత్య కార్యాల‌యం ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.అలాగే, భార‌తీయ విద్యార్థులు ప‌శ్చిమ ప్రాంతాల‌ వైపు వెళ్లేందుకు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తున్న‌ట్లు తెలిపింది. భార‌తీయ విద్యార్థులు ఈ ప్ర‌త్యేక రైళ్లలో ప‌శ్చిమ ప్రాంతాల‌కు చేరుకోవాల‌ని భార‌త దౌత్య కార్యాల‌యం తెలిపింది. అక్క‌డి నుంచి రోడ్డు మార్గాల ద్వారా హంగేరి, పోలాండ్, రోమానియా దేశాలకు చేరుకోవ‌చ్చు. అక్క‌డి నుంచి భార‌తీయ విద్యార్థుల‌ను ప్ర‌త్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఉత్త‌ర‌ కొరియా స్పందించింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగ‌డానికి అమెరికానే కారణమని ఉత్తర కొరియా ఆరోప‌ణ‌లు గుప్పించింది. ఉత్తర‌ కొరియా విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోవాల‌ని అమెరికా ప్ర‌య‌త్నించిన విష‌యాన్ని ప్ర‌స్తావించింది. ర‌ష్యా త‌న‌ భద్రత కోసం చట్టబద్ధమైన డిమాండ్ చేస్తే దాన్ని పట్టించుకోకుండా అమెరికా సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని అంత‌ర్జాతీయ నిపుణుడు పరిశోధకుడు రిజీ సాంగ్ అన్నారు.

ఈ విష‌యాన్ని ఉత్త‌ర‌కొరియా ప్ర‌స్తావించింది. అమెరికా ప్ర‌ద‌ర్శించిన ఈ తీరు వ‌ల్లే యుద్ధం ప్రారంభ‌మైంద‌ని పేర్కొంది. కాగా, యుద్ధ పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనేందుకు నాటో ప‌నిచేస్తోంది. ఈ కూట‌మిలో చేరిన ఏ దేశంపైన అయినా దాడి జ‌రిగితే అన్ని దేశాలు క‌లిసి ఆ దాడిని తిప్పికొడ‌తాయి. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోవాల‌ని అమెరికాతో పాటు స‌భ్య దేశాలు ప్ర‌య‌త్నించాయి. ఈ నేప‌థ్యంలోనే ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు చేస్తోంద‌ని ఉత్త‌ర‌కొరియా అంటోంది.