Moscow, August 21: రష్యాలో దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ధీటుగా రాజకీయాల్లో ముందుకు వెళుతున్న ప్రతిపక్ష రాజకీయ నాయకుడు అలెక్సీ నవాల్నీపై విషప్రయోగం (Alexei Navalny poisoning) జరిగింది. విషప్రయోగంతో ఆయన కోమాలోకి వెళ్లారని అనుచరులు వెల్లడించారు. ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉంచి, చికిత్స చేస్తున్నారని తెలిపారు. సైబీరియాలోని టోమ్‌స్క్ నగరం నుంచి మాస్కోకి విమానంలో వెళుతుండగా అనారోగ్యానికి గురవడంతో ఓమ్‌స్క్ నగరంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు నావల్నీ అధికార ప్రతినిధి కిరా యర్మిష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
విమానం ఎక్కే ముందు విమానాశ్రయంలోని కేఫ్‌లో టీ తాగారని, అనుమానాస్పదమైన పదార్థం ఏదైనా టీలో కలిపి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. విమానంలోకి ఎక్కిన తరువాత ఆయనకు చెమటలు పట్టాయని, తనని మాట్లాడుతూ ఉండమని కోరారని, తద్వారా అపస్మారక స్థితిలోకి వెళ్లకుండా ఉండొచ్చని చెప్పారని కిరా యార్మిష్ తెలిపారు. తరువాత బాత్రూంకి వెళ్లి కిందపడిపోయారని వెల్లడించారు. మాలి దేశంలో సైనికుల తిరుగుబాటు, రక్తపాతం వద్దంటూ దేశాధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీటా రాజీనామా, రద్దయిన పార్లమెంట్
నావల్నీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) వ్యతిరేక రాజకీయ శిబిరంలో (Russian opposition leader) ఉన్నారు. ఈ విష ప్రయోగంపై రష్యా అధ్యక్షుడు మీద నావల్నీ సన్నిహితులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తీవ్ర వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి పుతిన్, ఘోరంగా వ్యవహరిస్తున్నారని నావల్నీ సన్నిహితుడు వ్లాదిమిర్ మిలో ట్వీట్ చేశారు. నావల్నీపై విషప్రయోగం జరిగిందనే విషయాన్ని పోలీసులు అంగీకరించడం లేదని అధికార మీడియా సంస్థ టాస్ పేర్కొంది. గతంలో కూడా నావల్నీపై అనుమానిత విషప్రయోగం జరగ్గా ఆసుపత్రి పాలయ్యారు.
రష్యా ఆఫ్ ద ఫ్యూచర్ రాజకీయ పక్షానికి చెందిన అలెక్సీ నావల్నీ అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లో బలమైన నేతగా ఎదిగారు. ఆయన ఏకంగా అధ్యక్షుడు పుతిన్ పైనే అవినీతి ఆరోపణలు చేస్తూ పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. ఆయనపై పలుమార్లు దాడులు కూడా జరిగాయి. దీనికి ముందు కూడా ఒకసారి ఆయనపై విష ప్రయోగం జరిగింది. ఈ విష ప్రయోగం అధ్యక్షుడు పుతిన్ చేయించి వుంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.