Shanghai, Nov 24: చైనాలో వుహాన్ నుంచి కరోనా వైరస్ బయటకు వచ్చిందని ప్రపంచం మొత్తం విశ్వసిస్తోంది. అయితే చైనా దీనిని అసలు ఒప్పుకోవడం లేదు. చాలా సైలెంట్ గా కరోనావైరస్ ని నియంత్రించుకుంది. అయితే మళ్లీ అక్కడ కరోనా అలజడి (COVID-19 in China) మొదలైంది. దీంతో వందలాది విమానాలను రద్దు చేశారు. ఇటీవల షాంఘై ప్రాంతంలో కొత్తగా 7 కరోనా కేసులు (Shanghai Coronavirus outbreak) వెలుగుచూశాయి.
వీరందరికీ చైనాలోని అత్యంత రద్దీ అయిన ఎయిర్‌పోర్టుల్లో ఒకటైన పుడాంగ్ ఎయిర్‌పోర్టుతో (Pudong International Airport) సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన చైనా ప్రభుత్వం పుడాంగ్ విమానాశ్రయంలో విమాన సేవలు రద్దు (Hundreds of flights cancelled) చేశారు. ఇక్కడ పనిచేసే వేలాదిమంది సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
గతంలో అంటే కరోనా వైరస్ కేసులు ప్రారంభమైనప్పుడు కూడా చైనాలో ఇలానే కోవిడ్ వైరస్ వ్యాపించింది. అప్పుడు లాక్‌డౌన్‌లు, ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వంటి పద్ధతుల ద్వారా ఈ వైరస్‌ను చైనా చాలా వరకు నియంత్రించుకోగలిగింది. అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఇక్కడ కరోనా క్లస్టర్ కనిపించింది. ఈ కేసులన్నింటికీ పుడాంగ్ ఎయిర్‌పోర్టుతో సంబంధం ఉందని అధికారులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాశ్రయాన్ని మూసివేశారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులు, అంతర్జాతీయ విద్యార్థులు, అత్యవసర సిబ్బందికి చైనా ప్రభుత్వం అందజేస్తున్న ప్రయోగాత్మక వ్యాక్సీన్ తెరపైకి వచ్చింది. ఈ వ్యాక్సీన్‌ను ఎయిర్‌పోర్టు సిబ్బందికి కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. పుడాంగ్ విమానశ్రయం మూసివేయడంతో ఇక్కడ దాదాపు 500 విమాన సేవలు రద్దయ్యాయి. మొత్తమ్మీద 17,700మందికి కరోనా స్వాబ్ టెస్టులు చేశారు.