South Africa December 07: దక్షిణాఫ్రికా(South Africa)లో ఒమిక్రాన్(Omicron) వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత మూడు వారాలుగా అక్కడ డైలీకేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. కరోనా టెస్టు చేసిన ప్రతీ నలుగురిలో దాదాపు ఒక్కరికి కరోనా(Corona) పాజిటివ్‌గా తెలుతోంది. నమోదవుతున్న కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులే అధికంగా ఉన్నట్లు భావిస్తున్నారు నిపుణులు. దీంతో దక్షిణాఫ్రికా(South Africa)లో నాలుగో వేవ్(Fourth Wave) వచ్చిందని వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
సౌతాఫ్రికా(South Africa)లో గడిచిన వారం రోజుల్లోనే కేసుల సంఖ్య 5 రెట్లు పెరిగింది. రెండు వారాల క్రితం కొవిడ్ పాజిటివిటీ రేటు 2శాతం ఉండగా.. ప్రస్తుతం అది 25 శాతానికి చేరుకుంది. దేశంలో వైరస్ తీవ్రత పెరగడంతో ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా(Cyril Ramaphosa) ప్రకటన చేశారు. కొవిడ్ ఆంక్షలను మరింత కఠినతరం చేసే అంశంపై కొవిడ్‌పై జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నేషనల్ కరోనావైరస్ కమాండ్ కౌన్సిల్ త్వరలోనే సమావేశమవుతుందన్నారు.
ఒమిక్రాన్(Omicron) వేరియంట్ సంక్రమణ, దాని తీవ్రత తెలుసుకునేందుకు దక్షిణాఫ్రికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు తీవ్ర కృషి చేస్తున్నారని సిరిల్ రామఫోసా తెలిపారు. వీటితోపాటు ఈ వేరియంట్‌ను వ్యాక్సిన్‌లు ఎంతమేరకు ఎదుర్కొంటాయి? వ్యాధి తీవ్రతకు ఈ వేరియంట్ కారణమవుతుందా? అనే కోణంలోనూ నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారని అన్నారు. ఇప్పటివరకు ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం, ప్రస్తుతం కేవలం వ్యాక్సిన్ మాత్రమే కొత్త ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయగలవని చెబుతున్నాయన్నారు. అంతేకాకుండా వ్యాధి తీవ్రతను తగ్గించడంతోపాటు ఆస్పత్రుల్లో చేరిక, మరణం ముప్పు నుంచి వ్యాక్సిన్‌లు తప్పిస్తాయని రామఫోసా స్పష్టం చేశారు. మరికొన్ని రోజుల్లోనే ఈ వేరియంట్‌కు సంబంధించి అదనపు సమాచారం తెలుస్తుందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
దక్షిణాఫ్రికాలో రెండువారాల క్రితం నిత్యం వందల సంఖ్యలో వెలుగుచూసిన పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 10వేలు దాటింది. డిసెంబర్ తొలివారంలో రోజువారీ కేసుల సంఖ్య 16వేలకు చేరింది. అక్కడి జాతీయ అంటువ్యాధుల కేంద్రం గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో కొవిడ్ యాక్టీవ్ కేసుల సంఖ్య 86 వేలు దాటింది. రానున్న మరికొన్ని రోజుల్లోనే ఈ సంఖ్య గణనీయంగా పెరగనున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది.