Sri Lanka Economic Crisis: శ్రీలంక ఇంతలా ఆర్థిక సంక్షోభంలో కూరుకోపోవడానికి కారణాలు ఏంటి, పర్యాటక దేశంలో ఇంత విపత్తు ఎందుకు వచ్చింది, చైనా వల్లే ఈ సంక్షోభం తలెత్తిందా.. శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై ప్రత్యేక కథనం
Sri Lanka Economic Crisis (Photo/Getty I Images)

Colombo, Mar 24: శ్రీలంకను ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. భారీ విద్యుత్ కోత‌.. నిత్యావ‌సర వ‌స్తువుల కొర‌త‌.. భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. నిండుకున్న విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వ‌లు.. ఇలా ప్రతీ రంగంలో సంక్షోభం (Sri Lanka Crisis) పతాక స్థాయికి చేరింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా శ్రీ‌లంక దారుణ‌మైన ఆర్థిక ప‌రిస్థితుల‌ను (Battling its worst economic crisis) ఎదుర్కొంటున్న‌ది. ధ‌ర‌లు భారీగా పెంచినా.. త‌మ‌కు అవ‌స‌ర‌మైన పెట్రోల్ కోసం వేల‌ల్లో వాహ‌న‌దారులు పెట్రోల్ బంకుల.. నిత్యావ‌స‌రాల కోసం షాపుల‌ వ‌ద్ద బారులు తీర‌డం నిర‌స‌న‌ల‌కు దారి తీసింది.

శ‌నివారం నుంచి పెట్రోల్ బంకుల వ‌ద్ద బారులు తీరిన వారిలో ముగ్గురు వృద్ధులు ప్రాణాలు కోల్పోవ‌డం అక్కడ ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్ధం ప‌డుతున్న‌ది. శ్రీ‌లంక ఇలా దారుణ‌మైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవ‌డం 70 ఏండ్ల త‌ర్వాత ఇదే ఫ‌స్ట్ టైం. అసాధార‌ణ ఆర్థిక సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డేందుకు దేశ స‌ర్కార్ ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్న‌ది.ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు నిరసనలు చేస్తుండటంతో ప్రభుత్వం పెట్రోల్ బంకుల వద్ద దళాలను (Sri Lanka deploys troops as fuel shortage) మోహరించి పహారా కాస్తోంది. ప్రజలు పెట్రోలు, కిరోసిన్ కోసం బంకుల వద్ద బారులు తీరడంతో అక్కడ ఓ యుధ్ధ వాతావరణమే (sparks protests) కనిపిస్తోంది.

రష్యా దండయాత్రను ఆపండి, ప్రపంచ దేశాలు నిరసన చేపట్టాలని పిలుపునిచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, 29వ రోజుకు చేరుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం

డీజిల్ మరియు గ్యాసోలిన్ కొనుగోళ్ల కోసం ప్రజలు రాత్రిపూట క్యాంపింగ్ చేయడం అనేక పెట్రోల్ స్టేషన్‌లలో చూశారని పోలీసులు తెలిపారు. 22 మిలియన్ల జనాభా ఉన్న దేశంలో ఇంధన రిటైల్ వ్యాపారంలో మూడింట రెండు వంతుల వాటా కలిగిన సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ యొక్క పంపింగ్ స్టేషన్లలో సైనికులను మోహరించినట్లు సైనిక అధికారులు తెలిపారు. ఆర్థిక సంక్షోభంపై చర్చించేందుకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స కార్యాలయం బుధవారం అన్ని రాజకీయ పార్టీల శిఖరాగ్ర సమావేశాన్ని ప్రకటించింది. విప‌త్క‌ర ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప‌రిష్కారం కోసం అఖిల ప‌క్ష స‌మావేశానికి పిలుపునిచ్చినా విప‌క్షాలు ఈ భేటీని బ‌హిష్క‌రిస్తామ‌ని ప్ర‌క‌టించాయి.

దేశంలోని మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టుల‌కు చైనా నుంచి ఇబ్బ‌డిముబ్బ‌డిగా.. నిర్ల‌క్ష్య పూరితంగా తెచ్చుకున్న రుణాలు త‌డిసిమోపెడ‌య్యాయి. చైనా బీఆర్ఐ ప్రాజెక్టులో భాగంగా హంబాంటోటా పోర్ట్‌, కొలంబో పోర్ట్ నిర్మాణానికి శ్రీ‌లంక‌కు భారీగా రుణాలిచ్చింది. అంతే కాదు.. ఆ రుణ చెల్లింపున‌కు క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్న‌ది. శ్రీ‌లంక తీసుకున్న సుమారు 800 కోట్ల డాల‌ర్ల రుణంలో మెజారిటీ డ్రాగ‌న్ నుంచి తీసుకున్న‌ది. చైనా నుంచి మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టులను నిర్మించ‌డానికి ఇష్టారాజ్యంగా తీసుకున్న రుణాల వ‌ల్లే ఈ దుస్థితి నెల‌కొంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. శ్రీ‌లంక విదేశీ మార‌క ద్ర‌వ్యం నిల్వ‌లు 400 మిలియ‌న్ల డాల‌ర్ల లోపే.. ఇప్ప‌టికే ఈ ఏడాదిలో 700 కోట్ల డాల‌ర్ల రుణాలు చెల్లించాల్సిన దుస్థితిలో శ్రీ‌లంక ఉంది.

పాకిస్తాన్‌లో దారుణం, హిందూ యువతిని కాల్చివేసిన దుండుగుడు, కిడ్నాప్ ప్రయత్నాన్ని యువతి ప్రతిఘటించడంతో కాల్పులకు తెగబడిన అగంతకుడు

అంత‌కుముందు 2019లో ఈస్ట‌ర్ నాడు కొలంబో వ్యాప్తంగా బాంబు పేలుళ్ల‌తో దేశ ప‌ర్యాట‌కం దెబ్బ తిన్న‌ది. ఫ‌లితంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా కునారిల్లిపోయింది. విదేశీ మార‌క ద్ర‌వ్యం నిల్వ‌లు అడుగంటిపోయాయి. మ‌రోవైపు రుణాలు పెరిగిపోయాయి. విదేశీ క‌రెన్సీ కొర‌త‌తో దిగుమ‌తుల‌కు నిధులు స‌మ‌కూర్చ‌లేక ట్రేడ‌ర్లు చేతులెత్తేశారు. శ్రీ‌లంక‌కు విదేశీ మార‌క ద్ర‌వ్యం రావాలంటే ప‌ర్యాట‌క‌మే కీల‌కం. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ప‌ర్యాట‌క రంగం పూర్తిగా దెబ్బ తిన్న‌ది.

మరో వైపు రాజపక్స కుటుంబ/నియంత పాలనతో.. రైతులను సంసిద్ధం చేయకుండా.. ఏకపక్షంగా దేశమంతటా సేంద్రియ వ్యవసాయాన్ని అమల్లోకి తేవడం శాపమైంది. పంటలు దెబ్బతిని.. దిగుబడులు మూడో వంతు కంటే తక్కువకు పడిపోవడంతో ఆహార కొరత తీవ్రమైంది. ప్రజలకు తినడానికి తిండి లేదు. కొందామంటే డబ్బు లేదు. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. సేంద్రియ సాగు ఎలా చేయాలో రైతులకు అవగాహన కల్పించకుండా గత ఏడాది నూరు శాతం సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని ప్రధాని మహీంద్ర రాజపక్స ఏకపక్షంగా నిర్ణయించారు. కీలకమైన రసాయన ఎరువుల దిగుమతులను నిషేధించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘాలు హెచ్చరించినా వినలేదు.

పాక్ ప్రధాని నోట భారత సూపర్ అన్న మాట, విదేశాంగ విధానాన్ని ఆకాశానికెత్తిన ఇమ్రాన్, సీటుకిందకు ఆపదొచ్చేసరికి తత్వం బోధపడిందంటున్న నిపుణులు

ప్రపంచంలో నూరు శాతం సేంద్రియ సాగు చేపట్టిన ఏకైక దేశంగా పేరు తెచ్చుకోవాలన్న ఉబలాటంతో తీసుకున్న ఈ నిర్ణయం మొదటికే మోసం తెచ్చింది. వరితో పాటు టమోటా, క్యారట్‌, బీన్స్‌ తదితర కూరగాయ పంటలకు కూడా ఎరువులు అందుబాటులో లేకపోవడంతో నిరుడు సెప్టెంబరునాటికి దిగుబడులు సగానికి క్షీణించాయి. ఆ తర్వాత మూడో వంతుకు తక్కువకు పడిపోయాయి. దీంతో రైతులు తిరగబడ్డారు. మళ్లీ పాత పద్ధతులకు మళ్లినా.. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. ఆహార కొరత ఏర్పడింది. బియ్యం, కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. చివరకు నూరు శాతం సేంద్రియ సాగు లక్ష్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు నిరుడు డిసెంబరులో ప్రభుత్వం ప్రకటించింది.

దేశీయంగా ఆహార సంక్షోభానికి తోడు.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిన ప్రభావం శ్రీలంక ఎకానమీపై తీవ్రంగా పడింది. పెట్రోలు, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. ఉద్యోగాలు పోయాయి. కొత్తగా ఉపాధి అవకాశాల్లేవు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ కార్యాలయాల ముందు జనం ఆందోళనలకు దిగారు. ఏకంగా అధ్యక్ష కార్యాలయంలోకే చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. పెట్రోలు బంకుల వద్ద సైన్యం మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వైపు దేశ ఆర్థిక ప‌రిస్థితి దెబ్బ‌తిన‌డం విద్యార్థుల‌పై తీవ్రంగా ప‌డింది. కాగితం కొర‌త‌తో అన్ని ప‌రీక్ష‌లు నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు శ్రీ‌లంక సర్కార్ ప్ర‌క‌టించింది.

పంచ‌దార‌, ప‌ప్పులు, తృణ ధాన్యాలు, ఫార్మాస్యూటిక‌ల్స్ స‌హా ప్ర‌తి నిత్యావ‌స‌ర వ‌స్తువుల కోసం దిగుమ‌తుల‌పైనే ఆధార ప‌డ‌టం శ్రీ‌లంక‌ ఆర్థిక సంక్షోభంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆర్థిక విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. దిగుమ‌తి బిల్లులు చెల్లించ‌లేక‌పోవ‌డంతో నిత్యావ‌స‌ర వ‌స్తువుల కొర‌తకు దారి తీసిందంటున్నారు. ఇటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో శ్రీ‌లంక‌ను ఆదుకునేందుకు చైనా నిరాక‌రించింది. క‌రోనా మ‌హ‌మ్మారితో ప‌ర్యాట‌క రంగం దెబ్బ తిన్నందున శ్రీ‌లంక‌కు ఇచ్చిన రుణాల‌ను రీషెడ్యూల్ చేయ‌డానికి స‌సేమిరా అన్న‌ద‌ని వార్త‌లొచ్చాయి.

ఈ ద‌శ‌లో పొరుగుదేశం శ్రీ‌లంక‌ను ఆదుకునేందుకు భార‌త్ ముందుకు వ‌చ్చింది. ఆహార ధాన్యా, ఔష‌ధాలు, ఇత‌ర నిత్యావ‌స‌ర వ‌స్తువుల కొనుగోలు కోసం ఈ నెల 17న 100 కోట్ల డాల‌ర్ల రుణం ప్ర‌క‌టించింది. గ‌త నెల‌లో పెట్రోలియం ఉత్ప‌త్తుల కొనుగోలుకు 500 మిలియ‌న్ల డాల‌ర్ల రుణం ఇచ్చింది. అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చించి సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సహకరిస్తామని భారత్ హామీ ఇచ్చింది. ఇంతకుముందే దరిదాపుగా 90 కోట్ల డాలర్ల వరకు రుణాల చెల్లింపును భారత్‌ వాయిదావేయడం గమనార్హం. తాజా సాయంపై శ్రీలంక వ్యాపారవేత్త, ఆ దేశ పట్టణాభివృద్ధి మంత్రి నలక గొదాహెవా హర్షం వ్యక్తంచేశారు.

త‌మ దేశాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బెయిల్ ఔట్ ఇవ్వాల‌ని అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ (ఐఎంఎఫ్‌)ను కోర‌నున్న‌ట్లు శ్రీ‌లంక అధ్య‌క్షుడు గోట‌బ‌య్యా రాజ‌ప‌క్ష ప్ర‌క‌టించారు. విదేశీ రుణాలు, సావ‌రిన్ బాండ్ల చెల్లింపున‌కు 690 కోట్ల డాల‌ర్ల రుణం మంజూరు చేయ‌డానికి కొత్త ప‌ద్ద‌తి క‌నుగొనాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గ‌త‌వారం ఐఎంఎఫ్‌ను గోట‌బ‌య్యా అభ్య‌ర్థించారు.

శ్రీలంకలో పాలక రాజపక్స కుటుంబం తలపెట్టిన ఆర్థిక, వ్యవసాయ విధానాలు పూర్తిగా విఫలమయ్యాయి. అన్న మహీంద రాజపక్స ప్రధానిగా, తమ్ముడు గొటొబయ రాజపక్స అధ్యక్షుడిగా, మరో తమ్ముడు బసిల్‌ రాజపక్స ఆర్థిక మంత్రిగా అనుసరిస్తున్న విధానాలు ఆ దేశానికి అశనిపాతమయ్యాయి. 2019 అధ్యక్ష ఎన్నికల్లో గొటొబయ ఘన విజయం సాధించారు. 2020లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీకి భారీ మెజారిటీ లభించింది. మాజీ దేశాధ్యక్షుడైన మహీంద ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు చేపట్టిన చర్యలు, తప్పుడు ఆర్థిక విధానాలతో లంక ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.

పన్నులను బాగా తగ్గించడంతో రెవెన్యూ లోటు 2022 నాటికి 15 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం 17.5 శాతానికి పెరిగింది. సమాజంలో అశాంతి ఏర్పడింది. నిరసనలు నిత్యకృత్యమయ్యాయి. 2010 నుంచే విదేశీ అప్పులు అపరిమితంగా పెరిగిపోయాయి. విదేశీ అప్పులు 700 కోట్ల డాలర్ల వరకు చెల్లించాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆ దేశం వద్ద 230 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం మాత్రమే ఉంది. అంటే దివాలా తీసిందన్న మాటే. దీర్ఘకాలిక వ్యూహాలను కాదని.. ఎన్నికల ప్రయోజనాల కోసం స్వల్పకాలిక, స్వార్థపూరిత తప్పుడు ఆర్థిక విధానాలు అమలు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు తెలిపారు.

భారత్‌కు వలసబాట

ఆహార కొరత, ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక ఉత్తర ప్రాంతాలైన జాఫ్నా, మన్నార్‌ల నుంచి తమిళులు పెద్ద సంఖ్యలో భారత్‌కు వలసబాట పడుతున్నారు. మంగళవారం 8 మంది పిల్లలు, ఐదుగురు మహిళలు 16 మంది రెండు జట్లుగా మత్స్యకారుల పడవల్లో భారతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. ఆరుగురు ఉన్న జట్టును రామేశ్వరం తీరానికి సమీపంలో.. అరైచల్‌ మునై వద్ద నాలుగో దీవిలో మత్స్యకారులు దించేశారు. అక్కడ ఆకలితో అలమటిస్తున్న వారిని భారతీయ కోస్ట్‌ గార్డ్‌ కాపాడింది. అనంతరం తమిళనాడు పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని రామేశ్వరం వద్ద ఉన్న మండపం శరణార్థి శిబిరానికి తరలించారు. గత కొన్ని వారాలుగా తమకు తినడానికి తిండి లేదని.. శరణార్థులు తెలిపారు.

మొదటి జట్టు రూ.50 వేలు మత్స్యకారులకు చెల్లించగా.. రెండో జట్టు రూ.3 లక్షలు చెల్లించి పడవల్లో భారత్‌కు బయల్దేరాయి. రెండో జట్టు ఉన్న బోటుకు సాంకేతిక సమస్య ఏర్పడడంతో సోమవారం రాత్రంతా వారు చిమ్మచీకటిలో సముద్ర మధ్యంలోనే గడపాల్సి వచ్చింది. చివరకు మంగళవారం రాత్రి 9 గంటలకు రామేశ్వరం సమీపంలోని పంబన్‌ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. కాగా.. ఇది ప్రారంభం మాత్రమేనని.. శ్రీలంక తమిళులు పెద్ద సంఖ్యలో ఇండియాకు రానున్నారని మన్నార్‌లోని సామాజిక కార్యకర్త వీఎస్‌ శివకరన్‌ హెచ్చరించారు. శ్రీలంకలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని.. కిలో బియ్యం బుధవారం రూ.290గా ఉందని.. రేపటికల్లా రూ.500కి చేరే అవకాశముందన్నారు.