
Colombo, July 13: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabya Rajapaksa) దేశం విడిచి పారిపోయారు. అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గొటబాయ రాజపక్స కుటుంబంతో సహా బుధవారం వేకువజూమునే మాల్దీవులకు పారిపోయారు. భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్‌తో కలిసి వాయుసేన విమానంలో (Military Aircraft To Reach Maldives) మాల్దీవుల రాజధాని మేల్‌కు చెక్కేశారు. అక్కడి ప్రభుత్వం వెలనా విమానాశ్రయంలో రాజపక్సకు స్వాగతం పలికింది.
శ్రీలంక రక్షణ శాఖ నుంచి అవసరమైన అన్ని అనుమతులు లభించిన తర్వాతే గొటబాయ, ఆయన భార్య సైనిక విమానంలో మాల్దీవులకు వెళ్లారని సైన్యం వెల్లడించింది. మొదట మాలెలో దిగేందుకు అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అనుమతి ఇవ్వలేదని, అయితే మాల్దీవుల పార్లమెంటు స్పీకర్ మజ్లిస్, మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ జోక్యం చేసుకుని గొటబాయ విమానం ల్యాండ్ అయ్యేందుకు మార్గం సుగమం చేశారని తెలిపారు. ఆంటొనొవ్ సైనిక విమానంలోనే గొటబాయ దేశం విడిచినట్లు ధ్రువీకరించారు.
మంగళవారం రాత్రి విమానం కావాలంటూ అధ్యక్షుడు గొటబాయ తమను కోరారని శ్రీలంక రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. నిబంధనలకు లోబడి విమానాన్ని సిద్ధం చేశామని అధికారులు వివరించారు. శ్రీలంక త్రివిధ దళాలకు అధ్యక్షుడే సుప్రీం కమాండర్‌గా ఉంటారని వివరించారు. కాగా ప్రధానమంత్రి కార్యాలయం కూడా అధ్యక్షుడి పరారీని నిర్ధారించింది.
మంగళవారమే దేశం విడిచి పారిపోవాలనుకున్న గొటబాయకు ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది సహకరించలేదు. దీంతో ప్రత్యేక సైనిక విమానం ఏర్పాటు చేసుకుని బుధవారం వేకువజామునే మాల్దీవులకు వెళ్లారు.గొటబయ, ఆయన భార్య, కుటుంబసభ్యులకు చెందిన దాదాపు 15 పాస్‌పోర్టులను ఆయన సన్నిహితులు ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. వీటికి వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. అయితే నిబంధనల ప్రకారం ఎవరైనా దేశం విడిచి వెళ్లాలంటే పాస్‌పోర్టుతో స్వయంగా హాజరుకావాలి. కానీ గొటబయ, ఆయన కుటుంబసభ్యులు హాజరు కానందునా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించారు.
దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం (Sri Lanka Economic Crisis) నేపథ్యంలో ప్రజల ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ క్రమంలో అధ్యక్షభవనంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో ఆయన ఈనెల 9న అధికార నివాసం నుంచి పారియారు. అయితే అప్పటినుంచి గొటబయ ఎక్కడ ఉన్నారనే విషయం తెలియకుండా పోయింది. తాజాగా ఆయన మాల్దీవుల్లో తేలారు.
ఇదిలా ఉంటే ఆయన పారిపోయేందుకు భారత్ సహకరించిందనే వదంతులు శరవేగంగా వ్యాపించాయి. దీనిపై శ్రీలంకలోని భారత హైకమిషన్ కార్యాలయం స్పందించింది. ఈ వార్తలు నిరాధారం, కల్పితమైనవని కొట్టి పారేసేంది. ప్రజాస్వామ్యయుతంగా తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు భారత్ సాయం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈమేరకు ట్వీట్ చేసింది.
ప్రధాని పదవికి రాజీనామా చేసిన మహింద రాజపక్స, తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభంలో మునిగిపోయిన శ్రీలంక
మరోవైపు గొటబాయ తమ్ముడు, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స(Basil Rajapaksa) కూడా దేశం విడిచి పారిపోయినట్టు రిపోర్టులు వస్తున్నాయి. కాగా అరెస్టుల నుంచి తప్పించుకునేందుకే గొటబాయ రాజపక్స శ్రీలంక నుంచి పారిపోయారని సమాచారం. అరెస్టు చేసే అవకాశం ఉండడంతోనే ఆయన విదేశాలకు పారిపోవాలని నిర్ణయించుకున్నట్టు స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనల నేపథ్యంలో బుధవారం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. కానీ అంతకంటే ముందే లంక విడిచి పారిపోయారు. కాగా జులై 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.