Gotabaya Rajapaksa (Photo Credits: IANS)

Colombo, November 17:   శ్రీలంక (Sri Lanka) నూతన అధ్యక్షుడిగా గోటబయ రాజపక్స (Gotabaya Rajapaksa) ఎన్నికయ్యారు. కొత్త అధ్యక్షుడి (President)ని ఎన్నుకోవడం కోసం శ్రీలంకలో శనివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం మొత్తం 35 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అయితే ప్రధానంగా శ్రీలంక రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స (Mahinda  Rajapaksa) సోదరుడు అయిన గోటబయ రాజపక్స మరియు అధికార నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్  (NDF) పార్టీ నేత సాజిత్ ప్రేమదాస (Sajith Premad) మధ్యనే పోటీ జరిగింది.

శ్రీలకం ద్వీప దేశం ( island nation) మొత్తం 25 జిల్లాలను కలిగి ఉంది, వీటిని తొమ్మిది ప్రావిన్సులుగా విభజించారు. శనివారం పోలింగ్ సందర్భంగా మొత్తం 12,845 కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. . శ్రీలంకలో దాదాపు 16 మిలియన్ల మంది ఓటర్లు ఉండగా, దాదాపు 80 శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఆ దేశ జాతీయ ఎన్నికల సంఘం తెలిపింది.

ఆదివారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో గోటబయ రాజపక్స సారథ్యంలోని శ్రీలంక పొడుజన పెరమున (ఎస్‌ఎల్‌పిపి) పార్టీ ఘన విజయం సాధించింది. తమకు సుమారు 54 శాతం మెజారిటీ లభించిందని SLPP అధికార ప్రతినిధి కెహెలియా రాంబుక్వెల్లా తెలిపారు. ఈ విజయంతో గోటబయ రాజపక్స శ్రీలంక 8వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈరోజు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన గోటబయ గతంలో రిటైర్డ్ సైనికుడు. తన అన్నయ్య మహీంద రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్న (2005-2015) కాలంలో ఆయన శ్రీలంక రక్షణ మంత్రి పదవిని చేపట్టారు. కాగా, ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న మైత్రిపాల సిరిసేన ఈ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు.