File image of Boris Johnson | (Photo Credits: Getty Images)

London, April 7:  కరోనావైరస్ (COVID-19) బారిన పడిన బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (UK PM Boris Johnson) ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. 55 ఏళ్ల బోరిస్ జాన్సన్ కు పది రోజుల కిందట కోవిడ్-19 లక్షణాలు బయటపడ్డాయి, దీంతో తనంత తానుగానే స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు. అప్పట్నించి ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే సోమవారం మధ్యాహ్నం తర్వాత బోరిస్ జాన్సన్ ఆరోగ్యం మరింత విషమించడంతో ప్రధానిని లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్‌లో చేరుస్తున్నట్లు యూకే ప్రధాని కార్యాలయం - డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కల్లోలం రేపుతూ ప్రతిరోజూ వేల ప్రాణాలను బలిగొంటున్న కరోనావైరస్ ఇప్పుడు ఏకంగా ఒక దేశాధినేత ప్రాణాలకే ముప్పుగా పరిణమించడంతో సర్వాత్రా ఆందోళన నెలకొంది. బ్రిటన్ ప్రధాని త్వరగా కోలుకోవాలని ప్రపంచ దేశాధినేతలు ఆకాంక్షిస్తున్నారు. "బోరిస్ జాన్సన్ అతిత్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి బయటకు వస్తారని నమ్ముతున్నాను" అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.  తనకు వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని బ్రిటన్ ప్రధాని ప్రకటించినప్పుడు కూడా ప్రధాని మోదీ స్పందించి 'మీరొక ఫైటర్‌.. మీరు దీనిని జయిస్తారు' ఆయనకు ధైర్యాన్ని నూరిపోశారు.

ఇదిలా ఉండగా అనారోగ్యంతో బోరిస్ జాన్సన్ ఆసుపత్రిలో చేరడంతో ప్రధానమంత్రి పీఠంపై అప్పుడే రాజకీయాలు మొదలయ్యాయి. ఒకవేళ ప్రధాని ఆరోగ్యం మరింత క్షీణించి ఆయన పాలించలేని పక్షంలో లేదా చనిపోతే ఆయన వారసుడిగా ఎవరుండాలనే దానిపై యూకే కేబినేట్ మినిస్టర్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బోరిస్ జాన్సన్ ఐసీయూలో చేరడంతో 'అవసరం మేరకు' విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్‌ను (Foreign Secretary Dominic Raab) అపద్ధర్మ ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వర్తించాల్సిందిగా బోరిస్ జాన్సన్ కోరినట్లు డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ఈ నిర్ణయం పట్ల యూకే సీనియర్ కేబినెట్ మినిస్టర్ల నుంచి విముఖత ఎదురవుతుంది. యూకే రాజ్యంగం ప్రకారం దేశానికి సంబంధించి ఎవరైనా కీలక వ్యక్తులను నియమించాల్సి వచ్చినప్పుడు, కీలక నిర్ణయాలు తీసుకునేటపుడు బ్రిటన్ రాణి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయినప్పటికీ ప్రధానమంత్రికి కూడా పాలన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. అయితే ఇప్పుడు డామినిక్ రాబ్ కు అలాంటి అధికారాలు ఉంటాయా అనే దానిపై స్పష్టత లేదు.

ఒకవేళ ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందుకు మద్ధతు లభిస్తుందా లేదా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఆర్మీని దించాల్సి వస్తే ఆర్మీ ఆయన మాట వింటుందా? ఆయనకు సహచర మంత్రివర్గం నుంచి సహాకారం లభించడం కూడా కష్టమే అని చెబుతున్నారు.