Donald Trump (Photo Credits: ANI)

Washington DC, December 19: అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) పై బుధవారం రాత్రి అమెరికా ప్రతినిధుల సభ (House of Representatives) అభియోగాలు మోపింది. ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించే అభిశంసన (Impeachment) తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోని మెజారిటీ సభ్యులు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో సెనెట్‌లో ఆయన విచారణను ఎదుర్కోనున్నారు.

అధికార దుర్వినియోగం మరియు ఉభయ సభలను అడ్డుకోవడం అనే రెండు అభియోగాలపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాలపై సభ ఆమోదం తెలిపింది. దీంతో ట్రంప్ అమెరికా 45వ అధ్యక్షుడిగా కొనసాగాలా? వద్దా? అనే అంశంపై ఈ జనవరిలో సెనెట్  (Senate) లో విచారణ జరగనుంది.

ఎగువ సభ అయిన సెనెట్‌లో కూడా అభిశంసన తీర్మానం ఆమోదం పొందినపుడే ట్రంప్‌పై లేవనెత్తిన ఈ అభిశంసన తీర్మానం సంపూర్ణ ఆమోదం పొందినట్లు, అప్పుడే ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది. అయితే సెనెట్‌లో ట్రంప్‌ పార్టీకు చెందిన రిపబ్లికన్లదే ఆధిక్యత, ఈ నేపథ్యంలో సెనెట్‌లో అభిశంసన తీర్మానం ఖచ్చితంగా వీగిపోతుందనే నమ్మకంతో ట్రంప్ ఉన్నారు. తనపై ప్రారంభించిన అభిశంసన ప్రక్రియ నిలిపివేయాలంటూ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసికి ట్రంప్ ఘాటైన లేఖ రాశారు.

పక్షపాతంగా, రాజ్యాంగ విరుద్ధంగా తనపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ఒక అనైతికమైన చర్య అని ఆరోపించారు. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, వారి దురుద్దేశ రాజకీయ ప్రయత్నంలో తానే బాధితుడినంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.

"అమెరికా చరిత్రలో అత్యంత సిగ్గుపడే రాజకీయ ఎపిసోడ్లలో ఇది ఒకటి. తప్పు చేసినట్లు ఎలాంటి రుజువు లేకుండా, ఒక్క రిపబ్లికన్ ఓటు కూడా తీసుకోకుండా,  డెమొక్రాట్లు ఆమోదించిన అభిశంసన తీర్మానం చట్ట విరుద్ధమైంది" అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

White House Tweet:

అభిశంసన వ్యవహారం మొత్తాన్ని  "చేతబడి", "దురుద్దేశపూర్వకం" మరియు "బూటకం" అని ట్రంప్ అభివర్ణించారు. ఇప్పుడు అభిశంసన తీర్మానాలు సెనేట్ విచారణకు వెళ్తాయి. సెనెట్‌లో కావాల్సిన ఓట్లు 67 కానీ, డెమొక్రాటిక్ పార్టీ మరియు దాని మిత్రపక్షాలు కలిగి ఉన్న సీట్లు 47 మాత్రమే, దీని ప్రకారం ఆ తీర్మానాలు వీగిపోతాయి, అంటే సెనెట్ అమెరికా అధ్యక్షుడిని నిర్ధోషిగా ప్రకటించినట్లేనని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.