Washington,October 6: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇమ్మిగ్రేషన్ విధానాలను కఠినతరం చేస్తున్నఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు వస్తున్నవారందరికీ తప్పనిసరిగా ఆరోగ్య బీమా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో అమెరికా వెళ్ళేందుకు సమాయత్తమౌతోన్న వేలాది మంది భారతీయుల ఆకాంక్షలపై ట్రంప్ తాజా ఆదేశాలు నీళ్ళు చల్లినట్లయింది. ఆరోగ్యబీమా ఉన్నదని రుజువు చేసుకోలేని వారినీ, వైద్యఖర్చులను భరించలేని వారినీ అమెరికాలోకి అడుగుపెట్టనివ్వమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న వీసానిరాకరణ నిర్ణయం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆరోగ్యబీమా లేకుండా, వైద్యబిల్లులు చెల్లించే ఆర్థిక స్థోమత లేకుండా అమెరికాలోకి అడుగుపెట్టే వలసదారులను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు.
ఇందుకు సంబంధించిన కీలక బిల్లుపై ఆయన సంతకం చేశారు. ఒకవేళ, హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకుండా అమెరికాలో ప్రవేశించే వలసదారులు తప్పనిసరిగా 30 రోజుల్లోనే ఆరోగ్య బీమా సౌకర్యాన్ని పొందాల్సి ఉంటుందని వైట్ హౌస్ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. హెల్త్ కేర్ కోసం పెట్టుబడి పెట్టలేనివారికి తమ దేశంలో స్థానం లేదని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ఆరోగ్య వ్యవస్థపై అదనపు భారం కాబోమని నిరూపించుకున్న వారినే అనుమతించాలని అధికారులను ట్రంప్ ఆదేశించారు. అమెరికా పౌరుల్లోకంటే ఆరోగ్యబీమా లేని చట్టబద్దమైన ప్రవాసులు మూడు రెట్లు అధికంగా ఉన్నట్టు ట్రంప్ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా ఆరోగ్యవ్యవస్థకీ, పన్నులు చెల్లిస్తోన్న అమెరికా పౌరులకువలసదారుల వల్ల ఖర్చు పెరగకూడదని ట్రంప్ భావిస్తున్నట్టు వైట్ హౌస్ వెల్లడించారు.
వచ్చే నెల నవంబర్ 3 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని చట్ట బద్ధంగా దేశంలోకి ప్రవేశించేవారికి ఈ ఆదేశాలు అడ్డుకాబోవని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 18 వేల మంది శరణార్థులను మాత్రమే అమెరికాలో పునరావాసం కోసం అనుమతించాలని ట్రంప్ యంత్రాంగం గత నెలలో తెలిపింది. మోడ్రన్ రెఫ్యూజీ ప్రోగ్రామ్ ప్రారంభమైన తరువాత అమెరికాలో ఒక సంవత్సరంలో వలసదారుల సంఖ్య ఇంత తక్కువకు కుదించడం ఇదే మొదటిసారి. కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసా పొంది అమెరికాలో నివాసముండాలని కలలుకంటున్న విదేశీయులకు ఈ నిర్ణయం నిజంగా షాకేనని చెప్పాలి. ఈ కొత్త నిబంధన కారణంగా మొత్తం 23 వేల మంది భారతీయులు ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి. ప్రతిఏడాది దాదాపు 35 వేలకుపైగా ఫ్యామిలీ స్పాన్సర్డ్ ఇమ్మిగ్రెంట్లు అమెరికా వెళుతున్నారు. వారిలో మూడోవంతు మంది గ్రీన్‌కార్డ్‌కు దరఖాస్తు చేసుకుని అమెరికాలోనే స్థిరపడ్డారు.