US Election 2020

Washington, Nov 4: అమెరికాలో ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం 238 ఎలక్టోరల్‌ ఓట్లు బైడెన్‌కు రాగా, ట్రంప్‌కు 213 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. కొద్ది సమయం క్రితం ఇద్దరి మధ్య దాదాపు 80 ఎలక్టోరల్ ఓట్లు వ్యత్యాసం ఉంది. ఇతర న్యూస్ వివరాలను పరిశీలిస్తే.. ప్ర‌స్తుతం ఫాక్స్ న్యూస్ అంచ‌నా ప్ర‌కారం.. బైడెన్ 237, ట్రంప్ 210 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను సాధించారు. సీఎన్ఎన్ ప్రకారం బైడెన్ 224, ట్రంప్ 213 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను గెలిచారు. గార్డియ‌న్ ప్రకారం బైడెన్ 238, ట్రంప్ 213 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను గెలిచారు.

ఈ ఎన్నికల్లో (US Presidential Elections) పురుషులు మెజార్టీ భాగం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Republican Party Donald Trump) వైపు మొగ్గు చూపగా మహిళలు డెమొక్రాట్ అభ్యర్థి జోయి బైడెన్ (Democratic Party Joe Biden) వైపు మొగ్గు చూపారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల ప్రకారం, మహిళల్లో 56 శాతం మంది బైడెన్‌కు ఓటేశారట. ఇక ట్రంప్‌కు మహిళల నుంచి 43 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. ఇక పురుషుల విషయానికి వస్తే, ట్రంప్‌కు 49 శాతం మంది మద్దతు ఇచ్చారు. కాగా, ట్రంప్‌తో పోల్చుకుంటే బైడెన్‌కు పురుషుల మద్దతు కాస్త తక్కువగా ఉంది. 48 శాతం మంది పురుషులు బైడెన్‌కు మద్దతు తెలిపారు.

వర్గాల వారీగా చూస్తే.. తెల్లజాతీయులు ఎక్కువగా ట్రంప్‌కు ఓటేయగా.. నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్లు, ఆసియన్ అమెరికన్లు, ఇతరులు బైడెన్‌కు ఓటేశారు. నల్లజాతీయులైతే ఏక మొత్తంగా బైడెన్ వైపు మొగ్గారని ఆ సంస్థ తెలిపింది. తెల్లజాతీయుల్లో ట్రాప్‌కు 56 శాతం మద్దతు తెలపగా, కేవలం 42 శాతం మాత్రమే బైడెన్‌కు ఓటేశారు. ఇక నల్లజాతీయుల్లో 87 శాతం ఓట్లు బైడెన్‌కు వచ్చాయి. ఇక ట్రంప్‌కు అయితే కేవలం 12 శాతం మంది నల్ల జాతీయులు మాత్రమే ఓటేశారు.

అమెరికా హీరో ఎవరు..జీరో ఎవరు? వెనుకబడిన ట్రంప్, దూసుకెళ్తున్న బైడెన్, 270 ఎలక్టోర‌ల్ ఓట్లు గెలుచుకున్నవారికే అమెరికా అధ్యక్ష పీఠం

వయసుల వారీగా చూస్తే.. అమెరికన్ యువత బైడెన్‌కు గట్టి మద్దతు తెలిపింది. 18-29 ఏళ్ల వయసు మధ్య వారు బైడెన్‌ వైపు వెళ్లగా, మిగిలిన వారంతా ట్రంప్ వైపే ఉన్నారు. 65 ఏళ్లు పైబడిన వారు మాత్రం 50 శాతం బైడెన్‌కు మద్దతు ఇచ్చారు. ఇక 45-64 ఏళ్ల వయసు వారు బైడెన్‌కు 49 శాతం, ట్రంప్‌కు 50 శాతం మద్దతు తెలిపారు. 30-44 మధ్య వయసు వారు 52 శాతం ట్రంప్‌కు, 45 శాతం బైడెన్‌కు మద్దతు తెలిపారని అంతర్జాతీయ సంస్థ నివేదించింది.

ఇక అమెరికా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మోసం జ‌రుగుతోంద‌ని అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైట్‌హౌజ్ నుంచి ఆయ‌న ఇవాళ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నిక‌ల కౌంటింగ్‌లో ఫ్రాడ్ జ‌రుగుతున్న‌ద‌ని, తాము సుప్రీంకోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా ప్ర‌జ‌ల పట్ల ఇది మోసం అని, మ‌న దేశానికి ఇది అవ‌మాన‌క‌ర‌మ‌ని అన్నారు. వాస్త‌వానికి ఈ ఎన్నిక‌ల‌ను తామే గెలిచామ‌ని, కానీ దేశంలో స‌మ‌గ్ర‌త‌ను అమలు చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్యం అని ఆయ‌న అన్నారు. అమెరికా చ‌రిత్ర‌లో ఈ ఎన్నిక‌లు అసాధార‌ణ‌మ‌ని, రికార్డు స్థాయిలో ఓటింగ్ జ‌రిగింద‌న్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌క్రియ‌పై క‌ట్టుదిట్ట‌మైన చ‌ట్టాన్ని త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ట్రంప్ అన్నారు. మిలియ‌న్ల సంఖ్య‌లో ఉన్న పోస్ట‌ల్ ఓట్ల కౌంటింగ్‌ను వెంటనే ఆపేయాల‌ని అధ్యక్షుడు కోరారు.

ప్ర‌స్తుతం వ‌స్తున్న ఫ‌లితాల ఆధారంగా బైడెన్ ముందంజ‌లో ఉన్నారు. ఇంకా కీల‌క రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే కాసేప‌టి క్రితం బైడెన్ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. దాన్ని ట్రంప్ త‌ప్పుప‌ట్టారు. ఇది అత్యంత విషాద‌క‌ర స‌మ‌య‌మ‌ని, ఈ ఎన్నిక‌ల‌ను తామే గెల‌వ‌బోతున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. కీల‌క‌మైన ఫ్లోరిడాలో తామే గెలిచామ‌ని ట్రంప్ చెప్పారు. ఓహ‌యా, టెక్సాస్ లో గెలిచామ‌న్నారు. జార్జియాలో కూడా గెలిచామ‌ని, అక్క‌డ 2.25 శాతం అధిక ఓట్ల‌ను గెలిచిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌న‌ల్ని అందుకునే అవ‌కాశం లేదన్నారు. నార్త్ క‌రోలినాలోనూ 1.5 శాతం ఆధిక్యం ఉన్న‌ట్లు తెలిపారు. ఆరిజోనాలోనూ ఫ‌లితాలు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయ‌న్నారు. ఇక అత్యంత కీల‌క‌మైన పెన్సిల్వేనియాలోనూ సంపూర్ణ ఆధిక్యంలో ఉన్న‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. మిచిగ‌న్ రాష్ట్రంలోనూ భారీ మెజారిటీతో గెల‌వ‌నున్న‌ట్లు తెలిపారు. పెన్సిల్వేనియాలో కూడా భారీ మెజారిటీతో గెల‌వ‌నున్న‌ట్లు ట్రంప్ చెప్పారు.

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన లెక్కింపులో డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉండడం, ఇంతలో తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని ట్రంప్ ప్రకటించడం పట్ల.. ‘ట్రంప్‌కు ఓటమి భయం పట్టుకుందా?’ అని రాజకీయ విమర్శలు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి లెక్కింపు ప్రారంభమైనప్పటికీ నుంచి బైడెన్ ముందంజలోనే ఉన్నారు. అయితే మొదట్లో బైడెన్‌కు ట్రంప్‌కు మధ్య చాలా తేడా ఉండగా, ముగింపు దశకు చేరుకున్నా కొద్ది ఇద్దరి మధ్య తేడా చాలా వరకు తగ్గింది.

అమెరికాలో ఒకవైపు అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ జరుగుతుండగా ట్రంప్‌ సర్కారుకు షికాగో కోర్టు షాక్‌ ఇచ్చింది. దేశంలో ప్రజా ప్రయోజన పథకాలకు అర్హులైన వలసదారులకు శాశ్వత నివాస హోదానిచ్చే గ్రీన్‌ కార్డుల జారీపై నిషేధాన్ని విధిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఈ ఆదేశాలను దేశవ్యాప్తంగా పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు షికాగో కోర్టు జడ్జి గేరీ ఫినర్‌మన్‌ సోమవారం ఆదేశాలిచ్చారు. న్యూట్రిషన్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రామ్‌ (ఫుడ్‌ స్టాంప్స్‌), వైద్య సేవలు (మెడిక్యాడ్‌), హౌసింగ్‌ వోచర్‌ పథకాలకు అర్హత సాధించిన చట్టబద్ధ వలసదారులకు అమెరికా ప్రభుత్వం గ్రీన్‌కార్డులను మంజూరు చేస్తున్నది. దీనిని రద్దు చేస్తూ ట్రంప్‌ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి వరుసగా మూడో సారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. వివరాలు.. డెమొక్రాటిక్‌ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి మూడో సారి విజయం సాధించారు. ఢిల్లీలో జన్మించిన కృష్ణమూర్తి ప్రత్యర్థిప్రెస్టన్ నెల్సన్‌పై విజయం సాధించారు. 71 శాతం ఓట్లతో గెలుపొందారు. కృష్ణమూర్తి 2016లో తొలిసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.​ ఈయన తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు.

మరో భారత సంతతి వ్యక్తి‌ అమి బెరా కాలిఫోర్నియా నుంచి వరుసగా ఐదో సారి విజయం సాధించాలని ఆశిస్తున్నారు. అలానే మరో ఇండియన్‌ అమెరికన్‌ ఆర్‌ఓ ఖన్నా కూడా కాలిఫోర్నియా నుంచి మూడో సారి ప్రతినిధుల సభకు ఎన్నికవ్వాలని కోరుకుంటున్నారు. వీరిద్దరితో పాటు మరో ఇండో అమెరికన్‌ ప్రమిలా జయపాల్‌ కూడా వాషింగ్టన్‌ నుంచి మూడోసారి గెలుపొందాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా, వాషింగ్టన్‌ రాష్ట్రాల్లో ఓటింగ్‌ కొనసాగుతుంది. త్వరలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.