Washington, October 27: ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ అధినేత అబుబాకర్ ఆల్ బాగ్దాదిని అమెరికా సైనిక బలగాలు హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ అధికారి ఒకరు ఓ ప్రకటన విడుదల చేశారు. సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో బాగ్దాది హతమైనట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడే ఓ భారీ సంఘటన చోటుచేసుకుంది (సమ్‌థింగ్ వెరీ బిగ్ హ్యాస్ జస్ట్ హ్యాపెన్డ్) అంటూ ట్విటర్ ద్వారా వెల్లడించిన ట్వీట్ సారాంశం ఇదేనని కొందరు చెబుతున్నారు.
సిరియాలోని ఐసీస్ స్థావరాలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో బాగ్దాదీ మరణించాడని ఈ విషయాన్నే ట్రంప్ ఆ విధంగా ప్రకటించారని వారు చెబుతున్నారు. ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఫోరెన్సిక్ టెస్ట్ దీన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉందని అమెరికా అంటోంది.
ట్రంప్ ట్వీట్
Something very big has just happened!
— Donald J. Trump (@realDonaldTrump) October 27, 2019
అమెరికన్ ఔట్‌లెట్ న్యూస్‌వీక్ తెలిపిన ప్రకారం డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ఐసిస్‌కు వ్యతిరేకంగా, దాని అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ లక్ష్యంగా ఆపరేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా వెల్లడించింది. ట్రంప్ ప్రకటనతో అబు బకర్ అల్ బాగ్దాదీ మరణించి ఉండొచ్చని సమాచారం. యూఎస్ సైనిక విమానాల నుంచి జరిగిన కాల్పుల్లో ఇతడితో బాటు మరికొందరు కూడా మరణించారని తెలుస్తోంది. అయితే అమెరికా సైనికుల్లో ఎవరైనా మరణించారా లేక గాయపడ్డారా అన్న విషయం తెలియలేదు.
మరణించాడంటూ వార్తలు
The United States has carried out an operation targeting Islamic State leader Abu Bakr al-Baghdadi: Reuters (file pic) pic.twitter.com/tH1KUmDXaG
— ANI (@ANI) October 27, 2019
ఇదిలా ఉంటే బాగ్దాదీ దాదాపు అయిదేళ్లుగా ఎవరికీ కనబడలేదు. ఏప్రిల్ లో ఐసిస్ 18 నిముషాల వీడియోను విడుదల చేసింది. అందులో బాగ్దాదీ మాదిరే అదే పోలికలతో గడ్డంతో ఒక వ్యక్తి అసాల్ట్ రైఫిల్ పక్కన పెట్టుకుని శ్రీలంకలో ఈస్టర్ సందర్భంగా బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులను ఆ వ్యక్తి ప్రశంసిస్తున్నట్లుగా వీడియోలో ఉన్నారు. బాగ్దాద్ జీవించే ఉన్నాడనే దానిపై ఏళ్ల నుంచి ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
గతంలో అమెరికా డ్రోన్ల దాడుల్లో అతడు మరణించాడని ఒక సందర్భంలో సమాచారం అందింది. అయితే అది నిజం కాదని, సిరియాలోనో, ఇరాక్ లోనో యేవో మారుమూల ప్రాంతాల్లో దాక్కుని ఉండవచ్ఛునని కూడా అంటున్నారు. 2010 నుంచీ బాగ్దాదీ ఐసిస్ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇతడి ఆచూకీ తెలిపినా, హతమార్చినా అమెరికా 25 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.
1971 లో ఇరాక్ లోని సమర్రాలో పుట్టిన ఈ కరడు గట్టిన ఉగ్రవాది అసలు పేరు ఇబ్రహీం అవద్ అల్ బద్రి. ఇరాక్ మాజీ అధ్యక్షుడు దివంగత సద్దాం హుసేన్ హయాంలోని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఉగ్రవాద బృందాలను ఎలా ఆపరేట్ చేయాలో బాగ్దాదీ నేర్చుకున్నాడు. ఇరాక్, సిరియా దేశాల్లో మెల్లగా తన నెట్ వర్క్‌ని విస్తరించాడు. ఇస్లామిక్ విధానాలను నూరిపోస్తూ సూసైడ్ బాంబర్లకు శిక్షణ ఇచ్చాడు.