Russian President Vladimir Putin | (Photo credit: kremlin.ru)

Moscow, Feb 26: వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)..ఉక్రెయిన్ (Ukraine)పై దాడిలో ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మరోసారి పాపులర్ అయింది. దీంతో ఆయన గురించి తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా (America) వంటి అగ్రరాజ్యం హెచ్చరికలు, ఇతర మిత్ర దేశాల సూచనలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్న పుతిన్ ఎవరు? ఆయన హిస్టరీ ఏంటి? అసలు ఇంత పవర్‌ ఫుల్‌ గా ఎలా మారారు? గురించి తెలుసుకుందాం. 1952 లెనిన్‌గ్రాడ్‌ (సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌)లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన పుతిన్‌.. ఇప్పుడు అసాధారణ వ్యక్తిగా ప్రపంచానికి తెలుసు. పుతిన్‌ చదివింది లా. చదువు పూర్తయ్యాక సొవియట్‌ యూనియన్‌ సీక్రెట్‌ ఏజెన్సీ కేజీబీ (Komitet Gosudarstvennoy Bezopasnosti)కి 1975 నుంచి 1990 మధ్య ఏజెంట్‌గా, లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పని చేశాడు.

►సోవియట్‌ యూనియన్‌ పతనంతో క్రెమ్లిన్‌లో కొంతకాలం పని చేశాడు. 1991లో పుతిన్‌ రాజకీయ ప్రస్థానం మొదలైంది.

► 1999 నుంచి ప్రధానిగా ఏడాదిపాటు.. ఆ మరుసటి ఏడాదిలోనే అధ్యక్షుడిగా పగ్గాల చేపట్టి.. అధికార పదవుల్లో కొనసాగుతూ వస్తున్నాడు.

►2008 దాకా అధ్యక్షుడిగా కొనసాగి.. ఆపై 2008 నుంచి 2012 వరకు ప్రధానిగా ఉన్నాడు. 2012 నుంచి తిరిగి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నాడు. మార్చి 2018లో పుతిన్‌ నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎంపికయ్యాడు.

Russia-Ukraine Conflict: చెర్నోబిల్ న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ ప్లాంట్‌లో మళ్లీ పెరిగిన రేడియేష‌న్, ప్లాంట్ వ‌ల్ల యూరోప్ దేశాల‌కు ప్ర‌మాదం ఉన్న‌ట్లు ఆరోపణలు

►అధ్యక్ష పదవిలో రెండుసార్లు మాత్రమే కొనసాగాలన్న నిబంధన ఉండడంతో దిమిత్రి మెద్వెవ్‌.. పరస్సరం వాళ్ల స్థానాలు మార్చుకునేవాళ్లు. ఆ తర్వాత సుదీర్ఘ కాలం పదవిలో కొనసాగేలా రష్యా రాజ్యాంగానికి సవరణ చేశాడు.

►పుతిన్‌ తెలివిగా రాజ్యాంగ సవరణ ద్వారా 2036 వరకు తానే అధ్యక్షుడిగా ఉండేందుకు స్కెచ్‌ వేశాడు. కానీ, ఇది ప్రజావ్యతిరేకతకు కారణమైంది.

►రష్యాకు చెందిన గాజ్‌ప్రోమ్‌.. యూరోపియన్‌ యూనియన్‌కు అతిపెద్ద గ్యాస్‌ సప్లయర్‌. EUకి గ్యాస్‌ పైపుల ద్వారా సప్లయ్‌ అనేది పుతిన్‌కు అంతలా అంతర్జాతీయ ప్రాధాన్యతను కట్టబెట్టిందనడంలో ఆశ్చర్యం అక్కర్లేదు.

►2013-16 మధ్య నాలుగు సార్లు ప్రపంచంలోనే పవర్‌ఫుల్‌ వ్యక్తిగా పుతిన్‌ ఎన్నుకోబడ్డాడంటే.. అర్థం చేసుకోవచ్చు.

►అగ్రరాజ్య హోదా పోరులో ఏకంగా అమెరికానే టార్గెట్‌ చేస్తుంటుంది రష్యా. 2017లో ఏకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాడనే ఆరోపణ పుతిన్‌ మీద ఉంది. ఈ ఆరోపణను ఇటు పుతిన్‌, అటు ట్రంప్‌.. ఇద్దరూ ఖండించారు.

►రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, 69 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉండడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. డైట్‌, వ్యాయామాల నుంచి ఆఖరికి దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంలో స్నానం చేయడం వల్లే బలిష్టంగా ఉంటాడని చెప్తుంటారు. ఇందుకోసమే పుతిన్‌ తరచూ రష్యాలోని అల్తాయ్‌ పర్వత ప్రాంతాలకు వెళ్తారు.

►రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2014 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యాడు. సిరియాపై అమెరికా క్షిపణి దాడిని నివారించడంలో కీలక పాత్ర పోషించినందుకు.. రసాయనిక ఆయుధాలను సిరియా ధ్వంసం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నందుకు నామినేట్ అయ్యాడు.

►పుతిన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. స్వతహాగా బలశాలి అయిన పుతిన్‌.. తరచూ కొత్త అవతారాలతో అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

►సిక్స్‌ ప్యాక్‌ ప్రియుడైన పుతిన్‌.. తన డైట్‌ను అస్సలు బయటకు పొక్కనియడు. విహార యాత్రలకు తక్కువ సెక్యూరిటీతోనే వెళ్తుంటాడు. రష్యా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ పటిష్టంగా ఉండడం వల్లే అలా ధైర్యంగా తిరిగే వాడు.

►పుతిన్‌ యుద్ధం రుచి మరిగిన వ్యక్తి. ఈయన హయాంలో నాలుగు యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు ఉక్రెయిన్‌ వార్‌ ఐదవది.

►కరోనా టైంలో వైరస్‌ బారినపడకుండా.. డిస్‌ఇన్‌ఫెక్షన్‌ భారీ టన్నెల్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు స్థానిక మీడియా సంస్థలు కథనాలు రాశాయి.

►రష్యన్‌ సామ్రాజ్యం విస్తరించాలనే ఆకాంక్షతోనే వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌ దండయాత్రను మొదలుపెట్టాడని అమెరికా ఇంటెలిజెన్స్‌ అధికారుల ఆరోపణ. 2021లో ఉక్రెయిన్‌ను రష్యా కిరీటంగా అభివర్ణించిన పుతిన్‌ వ్యాఖ్యలనే అందుకు ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు వాళ్లు.

►ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనా పుతినాతో 1983లో వివాహం, 2014లో విడాకులు. ఈ జంటకు మరియా, కటేరినా అనే కూతుళ్లు ఉన్నారు. రష్యా మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోర్‌ మాజీ భార్య వెండి డెంగ్‌తో పాటు పలువురు టీనేజర్లతో పుతిన్‌ డేటింగ్‌ చేసినట్లు పుకార్లు ఉన్నాయి.

►పుట్‌బాల్‌ అంటే పుతిన్‌కు విపరీతమైన పిచ్చి. పెంపుడు జంతువులంటే మమకారం. మీడియాను మ్యానేజ్‌ చేయడంలో దిట్ట.

►పాలనాపరంగా పుతిన్‌ మీద ఫిర్యాదులు లేకపోయినా.. ఫారిన్‌ పాలసీలు, ఆయుధ ఒప్పందాల విషయంలో, విదేశీ వ్యవహారాల్లో జోక్యంపై మాత్రం సొంత ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుంటాయి.

Russia-Ukraine war Updates: చైనా జోక్యంతో మొత్తబడ్డ పుతిన్, ఉక్రెయిన్ అధికారులతో చర్చించేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటన, బెలారస్ లో చర్చిద్దాం రండి! అంటూ రష్యా అధ్యక్షుడి కార్యాలయం ప్రకటన

►పుతిన్‌ ఊహకు అందని వ్యక్తి. ఆయన ముఖకవళిలను అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. హవభావాలతో ఎదుటివాళ్లను బోల్తా కొట్టించడం పుతిన్‌ నైజం.

►అధ్యక్ష భవనం కంటే.. బయటే ఎక్కువగా తిరిగే పుతిన్‌, కావాలనే తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడనే వాదన ఉంది. గడ్డకట్టే చలిలో.. మంచు గడ్డల మధ్య చన్నీటి స్నానం, గ్రౌండ్‌లోకి దిగి ఆటలు, అడవి జంతువుల వేట, కరాటే, పవర్‌ పంచ్‌లు.. ఇలా అసాధారణమైన, ప్రమాదకరమైన స్టంట్‌లతో తానొక మ్యాచో మ్యాన్‌, సూపర్‌ హీరో అనే ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంటాడు.

►పుతిన్‌ను గ్రిగోరి రస్‌పుతిన్‌(జార్‌ నికోలస్‌ 2 సలహాదారు, మిస్టరీమ్యాన్‌గా ప్రసిద్ధి) వారసుడిగా భావిస్తుంటారు కొందరు. కానీ, వాళ్లిద్దరికీ సంబంధం లేదు. పుతిన్‌ మీద రష్యాలో పాటలే కాదు.. జోకులు, మీమ్స్‌ విపరీతంగా వైరల్‌ అవుతుంటాయి.