Washington DC, Jan 30: అమెరికాలోని వాషింగ్టన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి విదితమే. 64 మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం.. మరో హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం (Washington DC Plane Crash) జరిగింది. దీంతో ఆ రెండూ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి.ఈ ప్రమాదంలో(D.C. plane crash) 64 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అక్కడి అగ్నిమాపక శాఖ చీఫ్ వెల్లడించారు. ఇప్పటి వరకు 28 మృతదేహాలను నదిలోంచి బయటకి తీసినట్లు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
వాషింగ్టన్ డీసీలో విమాన ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఢీకొన్న విమానం- హెలికాప్టర్, వైరల్ వీడియో
విమానంలో ఉన్న వారెవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద ప్రమాదమన్నారు. విమానం తలకిందులుగా నది అడుగుభాగంలో కూరుకుపోయిందని, అక్కడికి దగ్గర్లోనే హెలికాప్టర్ శకలాలను కూడా గుర్తించామని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న జాన్ డొన్నెలీ తెలిపారు.
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానం కాన్సాస్‌లోని విషిటా నుంచి బయలుదేరి వాషింగ్టన్ (Washington) సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగేందుకు సిద్ధమవుతుండగా.. రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్-60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది.
ఘటన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఇక, హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారని, వీఐపీలు ఎవరూ లేరని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.అంతర్జాతీయ మీడియా ప్రకారం.. డైవ్ బృందం విమానం నుంచి రెండు డేటా రికార్డర్లలో ఒకదాన్ని, బ్లాక్ బాక్స్‌లను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనపై పెంటగాన్ దర్యాప్తు జరుపుతుందని అమెరికా రక్షణ కార్యదర్శి సీన్ డఫీ పేర్కొన్నారు. సైనిక హెలికాప్టర్.. పీఎస్‌ఏ విమానం మార్గంలోకి ఎందుకు వచ్చిందో తెలియలేదన్నారు.