Gold Price, Representational Image | Photo Credits; IANS

Mumbai, January 6:  మొన్నటివరకు అంతర్జాతీయంగా దేశాల మధ్య ఏర్పడిన 'వాణిజ్య యుద్ధం' కారణంగా పెరిగిన బంగారం ధరలు, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ 7 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ముంబై బులియన్ మార్కెట్లో సోమవారం రోజు 10 గ్రాముల 24 కేరట్స్ స్వచ్ఛమైన బంగారం ధర (Gold Price) రూ. 42,125 గా నమోదైంది. హైదరాబాదులో  ధర రూ. 42,165, దిల్లీలో రూ. 42,120, బెంగళూరులో రూ. 42,180, కోయంబత్తుర్ లో 42, 160గా ఉన్నాయి.

ఇటు వెండి కూడా ఒక్కరోజులో ఏకంగా రూ. 1400 పెరిగి, సోమవారం కిలో వెండి ధర రూ. 51,042గా నమోదైంది. ఇరాన్- అమెరికా  (Iran- US Tensions) దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఆవరించడంతో ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్లు పతనమవుతున్నాయి. సేఫ్ సైడ్ కోసం ఇన్వెస్టర్లు బంగారం, ముడిచమురుపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి.

ప్రపంచంలోని సగం వంతు చమురు నిక్షేపాలు పశ్చిమాసియా (West Asia) ప్రాంతంలోనే ఉన్నాయి. ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీం సులైమానిని యూఎస్ దళాలు హతమార్చడం ద్వారా దాని ప్రభావం మార్కెట్ పై పడింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ ధర 70.49 డాలర్లు పలుకుతోంది.

ఇరాన్- ఇరాక్ లపై ట్రంప్ హెచ్చరికల ప్రభావం భారతీయ మార్కెట్లపైనా పడింది. సోమవారం దేశీయ మార్కెట్లు (Stock Market) భారీ నష్టాలతో ముగిశాయి. ట్రంప్ ప్రకటనతో దేశీయంగా మూడు గంటల్లోనే ఇన్వెస్టర్ల రూ. 3 లక్షల కోట్ల సంపదం ఆవిరైపోయింది. దలాల్ స్ట్రీట్ లో ప్రతీ 5 స్టాక్లలో 4 స్టాక్స్ నష్టాలతోనే కొనసాగాయి. సెన్సెక్స్ 788 పాయింట్లు నష్టపోయి 40,676 వద్ద ముగిసింది, నిఫ్టీ 233 పాయింట్లు నష్టపోయి 11,993 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం (Rupee Value) విలువ 1 డాలర్ కు 72 రూపాయిలుగా నమోదైంది.