Mumbai,Mar 16: యస్ బ్యాంక్ వ్యవహారంలో పారిశ్రామికవేత్త రిలయన్స్ గ్రూపు అధినేత అనిల్ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. యస్ బ్యాంక్ కేసులో (Yes Bank crisis) తమ ముందు హాజరు కావాలని అనిల్ అంబానీకి (Anil Ambani) ఈడీ సమన్లు జారీ చేసింది. యస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ (Reliance Group) రూ 12,800 కోట్లు రుణాలు పొందింది.
నాడు వేల కోట్లు, నేడు జీరో బ్యాలన్స్ షీట్
ఇవి నిరర్థక ఆస్తులుగా మారడంతో ఈ రుణాలకు సంబంధించి ప్రశ్నించేందుకు అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ (Enforcement Directorate) ఎదుట హాజరయ్యేందుకు ఆరోగ్య కారణాల దృష్ట్యా తమకు సమయం కావాలని ఆయన కోరారు.
కాగా అనిల్ అంబానీ గ్రూప్, ఎస్సెల్, ఐఎల్‌ఎఫ్‌ఎస్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, వొడాఫోన్ తదితర కంపెనీలకు యస్ బ్యాంక్ ఇంచిన రుణాల వసూళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 6న జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు అనిల్ అంబానీ కొత్త వ్యూహం
ఇక సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్‌లో పెట్టుబడులకు పలు ప్రైవేట్ బ్యాంకులు, సంస్థలు ముందుకురావడంతో పునరుద్ధరణ ప్రణాళిక ఊపందుకుంది. యస్ బ్యాంక్ షేర్ సోమవారం ట్రేడింగ్ ఆరంభంలో ఏకంగా 33 శాతం మేర పెరిగింది.
సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18న బ్యాంకుపై మారటోరియం తొలగిపోనుంది. ప్రస్తుతం ఆర్‌బీఐ నియమిత అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్ ఆ తర్వాత సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు.
ఆయన సారథ్యంలో కొత్త బోర్డు ఏర్పాటవుతుంది. పునర్‌వ్యవస్థీకరించిన బోర్డులో సునీల్ మెహతా (పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్).. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, మహేష్ కృష్ణమూర్తి, అతుల్ భెడా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉంటారు.
మార్చి 13 నుంచి యస్ బ్యాంక్ పునరుద్ధరణ స్కీమ్ 2020ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ప్రభుత్వం ఈ అంశాలు పొందుపర్చింది. ‘ప్రణాళిక అమల్లోకి తెచ్చిన మూడో పని దినం సాయంత్రం 6 గం.లకు మారటోరియం తొలగిపోతుంది. ఆ పైన 7 రోజుల తర్వాత కొత్త బోర్డు ఏర్పాటవుతుంది’ అని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏప్రిల్ 3 దాకా విత్‌డ్రాయల్స్‌ను రూ. 50,000కు పరిమితం చేస్తూ మార్చి 5న యస్ బ్యాంకుపై ఆర్‌బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.