కరోనావైరస్ మహమ్మారి (Coronavirus Pandemic) ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే వందకు పైగా దేశాలకు పాకిన ఈ వైరస్ ప్రభావంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇండియా కూడా దేశం నుంచి విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది, ఏప్రిల్ 15 వరకు టూరిస్ట్ వీసాలను రద్దు చేసి స్వీయ నిర్బంధం విధించుకుంది. ప్రభాస్ 20వ చిత్రం షూటింగ్ కోసం చిత్ర బృందం జార్జియా బయలుదేరి వెళ్లింది. టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ సినిమాలో పూజ హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది.
'బుట్టబొమ్మ' తాను ముఖానికి మాస్క్ వేసుకొని, స్వెట్‌షర్ట్‌లో ఇస్తాన్‌బుల్ విమానాశ్రయంలో ఒంటరిగా కూర్చొని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రభాస్ 20 (#Prabhas20)సినిమా కోసం జార్జియా వెళ్లినట్లు ట్వీట్ చేసింది.
"సినిమాలపై ప్రేమతో నేను చేసే పనులు ... జార్జియా.. నేను వచ్చాను ... (బ్యాక్‌గ్రౌండ్‌లో రాకీ థీమ్ సాంగ్ ప్లే అవుతోంది) # ప్రభాస్ 20 # బ్యాక్ఆఫ్ రోనా # షూట్‌లైఫ్" అంటూ పూజ క్యాప్షన్‌లో రాసింది.
పూజ హెగ్డే పోస్ట్ చూడండి.
ఇటీవలే ప్రభాస్ కూడా విమానాశ్రయంలో మాస్క్‌తో కనిపించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ప్రభాస్ కూడా ఇప్పుడు తన 20 చిత్రం షూటింగ్ కోసం జార్జియాలో ఉన్నట్లు పూజ హెగ్డే పోస్ట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.
అయితే, ఫిల్మ్ మేకర్స్‌కి సినిమాల పట్ల ప్రేమ, అంకితభావం ఉండొచ్చు కానీ వారి ఆరోగ్యం కంటే ఎక్కువనా? అనే ప్రశ్నలు, ఆందోళన ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది. ఈ సినిమాలోని డ్యుఎట్లు, రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా హీరోహీరోయిన్లు ఇలాగే మాస్క్‌లతో కనిపిస్తారా అని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు.
ప్రపంచమంతా కరోనావైరస్ భయం ఉన్నా కూడా 'ప్రభాస్ 20' సినిమా టీంకు మాత్రం అవేమి పట్టకుండా తమ షూటింగ్ షెడ్యూల్‌ను యధావిధిగా కొనసాగిస్తున్నారు. కరోనా భయంతో అందరూ 'వర్క్ ఫ్రమ్ హోమ్' కు పరిమితమైతే, ఈ సినిమా యూనిట్ మాత్రం 'వర్క్ ఫ్రమ్ ఔట్ ఆఫ్ ద టౌన్' పాలసీని పాటిస్తున్నట్లుంది. ఏదిఏమైనా వారంతా సేఫ్‌గా ఉండాలని మనం కోరుకుందాం.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే కే.కే రాధాకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ప్రభాస్ కు 20వ చిత్రం కావడంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. యూరోప్ దేశాలలో ఎక్కువ సీన్లు ఉంటాయని ప్రచారంలో ఉంది. అందుకే ఈ టీమ్ మొత్తం ఇప్పుడు యూరోప్ దేశాలలో పర్యటిస్తున్నారు. పూజతో పాటు మరో హీరోయిన్ భాగ్యశ్రీ నటిస్తోంది. ఉగాదికి ఫస్ట్ లుక్, దసరాకి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ప్రభాస్ గత చిత్రం 'సాహో' కు హైప్ బాగా వచ్చి, కలెక్షన్స్ రాబట్టినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.