మధురమైన దివ్యగానం దివికేగింది. గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు (S P Balasubrahmanyam's Funeral) ముగిశాయి. ఐదు దశాబ్ధాల పాటు తన గానామృతంతో సంగీత ప్రేక్షకులను ఓలలాడించిన పాటల మాంత్రికుడికి అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు మధ్య అంత్యక్రియలు (SP Balasubrahmanyam's Funeral In Chennai) జరిగాయి. చెన్నైలోని తామరైపాక్కం వ్యవసాయక్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు చెప్పారు.
సంప్రదాయం ప్రకారం తనయుడు చరణ్ - అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమ సంస్కారానికి కుటుంబ సభ్యులు, కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కొవిడ్ నిబంధనల కారణంగా అభిమానులకు తిరువళ్లూరు పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఆంక్షలు ఉన్నా తమ అభిమాన స్వరమాంత్రికుడికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు అభిమానులు భారీగానే హాజరయ్యారు.
చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్ లో అంతిమ సంస్కారాలు జరిగాయి. శ్రౌత శైవ ఆరాధ్య సంప్రదాయం ప్రకారం బాలుని ఖననం చేశారు. అంతకు ముందు కుటుంబసభ్యులు సంప్రదాయబద్ధంగా వైదిక క్రతువు పూర్తి చేశారు. దీంతో సొలసితి అంతట నీ శరణనే చొచ్చితిని అంటూ ఆయన ఇక శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలు అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రితో పాటు సూపర్‌స్టార్ విజయ్, మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు బాలును కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఫాంహౌస్‌కు చేరుకున్నారు.
ANI Tweet
Tamil Nadu: Last rites of singer SP Balasubrahmanyam being performed at Thamaraipakkam village of Thiruvallore district.
SP Balasubrahmanyam passed away yesterday. pic.twitter.com/jEdERZAzNV
— ANI (@ANI) September 26, 2020
ఆయన మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూతతో సినీపరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఐదున్నర దశాబ్దాల పాటు అద్భుతమైన గాత్రంతో అలరించిన గాన గాంధర్వుడు తిరిగి రాలని లోకాలకు వెళ్లిపోయారని సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు..నివాళులు అర్పించారు. గన గంధర్వుడికి అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. భౌతికంగా మీరు తమ మధ్య లేకపోయినా.. మీరు పాడిన పాటల పూతోటలు తమను అలరిస్తూనే ఉంటాయని స్మరించుకుంటున్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో ఆగస్టు 4 న చెన్నైలోని MGM ఆసుపత్రిలో చేరారు.. అక్కడ అయన కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ అయన ఆరోగ్య స్థితిలో మార్పు రాలేదు.. ఈ క్రమంలో అయన శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. దాదాపుగా పదహారు భాషలలో నలబై వేలకి పైగా పాటలు పాడారు ఎస్పీ బాలు.. అయన మరణం భారతీయ సినిమాకే తీరని లోటని చెప్పాలి.
బాలు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది.