Meera Chopra (Photo Credits: Instagram)

Hyderabad/ New Delhi: సినీ నటి మీరా చోప్రా ఫిర్యాదుపై తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. మీరా చోప్రా చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితులకు చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజిపి మరియు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ను కోరినట్లు శుక్రవారం ఆయన చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మీరా చోప్రా తన అభిమానులతో లైవ్ లో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంలో ఒక ప్రశ్నకు బదులు చెప్తూ తాను జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయలేదని, అతని అభిమానిని కాదని, అయితే మహేశ్ బాబును అభిమానిస్తానంటూ మీరా పేర్కొంది. దీంతో ఎన్టీఆర్ అభిమానుల నుంచి మీరా చోప్రాకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ అభిమానులు అని చెప్పుకునే కొంతమంది మీరా చోప్రాను అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. మరియు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు విషయాన్ని ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వివాదం సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

Here's Minister KTR's response: 

మీరా చోప్రా అంతటితో ఆగకుండా తెలంగాణ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవిత, ఏపీ సీఎం జగన్ లను ట్విట్టర్ లో ట్యాగ్ చేసి మీ రాష్ట్రం నుంచి కొంత మంది అసభ్యకరంగా దూషిస్తున్నారు. మహిళలపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ స్పందించారు, అది చూసి మీరా చోప్రా కూడా చాలా ధన్యవాదాలు సార్, మీ రిప్లై నాకెంతో ముఖ్యమైనది అంటూ రీట్వీట్ చేశారు.

అయితే ఇంత జరుగుతున్నా ఇటు టాలీవుడ్ నుంచి ఒక్కరూ కూడా ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.