హాస్యనటిగా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన ప్రేక్షకులను దగ్గరైన నటి పావలా శ్యామల (Veteran Telugu Actress Pavala Syamala) ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఒకవైపు కూతురి అనారోగ్యం, మరోవైపు ఆర్థిక సమస్యలతో ఆమె తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు (Telugu Actress Pavala Shyamala) నెలకు 10వేల రూపాయల పెన్షన్ వచ్చేలా సహాయం అందించారు. అయితే ప్రస్తుతం ఆ పెన్షన్ కూడా సరిగ్గా రావడం లేదని ఆమె ఆవేదన చెందారు. గత మూడు నెలలు ఇంటి అద్దె కూడా కట్టలేదని శ్యామల వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఆమెను ఆదుకునేందుకు తెలుగు సినీ ఇండస్ట్రీ (Tollywood Helps to Pavala Shyamala) ముందుకు వచ్చింది. ఆర్టిస్ట్ కరాటే కల్యాణి తన వంతు సాయాన్ని అందించారు. అలాగే మా అసోసియేషన్ ద్వారా కూడా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమెను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను తీసుకున్నారు. ‘మా’ సభ్యత్వంతో పాటు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ సభ్యులు కరాటే కళ్యాణి, సురేష్ కొండేటి శ్యామల ఇంటికి చేరుకొని 'మా' అసోసియేషన్ కార్డు సహా 1,01,500 రూపాయల చెక్కును అందించారు.
Here's Update Tweet
As we all know our #MegastarChiranjeevi @KChiruTweets garu financially helped artist Pavala Shyamala in past. Again in this tough times #Annayya supported her financially vth 1,15000. She vl receive 6k every mnth from MAA as a pension.#JaiChiranjeeva🙏 pic.twitter.com/mPWkrrzDqy
— Ravanam Swami naidu (@swaminaidu_r) May 18, 2021
ఇక ‘మా’ మెంబర్ షిప్ కార్డ్ తో నెలకు 6 వేల చొప్పున ప్రతినెలా ఫించను రూపంలో అందుతుందని తెలిపారు. ‘మా’ సభ్యత్వం పొంది ఉంటే ఎవరైనా ఆర్టిస్ట్ అకాల మరణం చెందితే వారికి రూ. 3లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. పావలా శ్యామల కూతురి వైద్యానికి సంబంధించి న్యూరో సిటీ సెంటర్ వైద్య నిపుణులు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు.
పావలా శ్యామల పరిస్థితిని తెలుసుకొని ఆమెకు సహాయం చేయడానికి సిసింద్రీ డైరెక్టర్ శివ నాగేశ్వర రావ్ ముందుకు వచ్చారు. తన వంతు సహాయంగా ఆమెకు 50వేల రూపాయలను అందించారు. ఆయన తరుపు వాళ్లు వచ్చి పావలా శ్యామలకు ఆ డబ్బును అందించారు. తాజాగా నటుడు జీవన్ కుమార్ కూడా పావలా శ్యామలకు సాయమందించారు. ఆమె పరిస్థితిని తెలుసుకొని స్వయంగా ఇంటికి వెళ్లిన ఆయన తనవంతు సాయాన్ని ఆమెకు అందించారు. ఈ నగరానికి ఏమైంది , ఫలక్నామా దాస్, సఫారీ వంటి సినిమాల్లో నటించిన జీవన్ కుమార్ నిత్యావసరాలతో పాటు ప్రతి రోజు భోజన వసతి కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
చిరంజీవి తనకు సాయం చేయడం పట్ల పావలా శ్యామల ఆనందం వ్యక్తం చేశారు. గతంలోను ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవి రూ. 2లక్షలు ఇచ్చి సాయం అందించారని, మళ్లీ ఇప్పుడు తనను ఆదుకున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ఇక జీవన్ కుమార్ అందించిన సహాయంపై నటి పావలా శ్యామల స్పందించారు. స్వయంగా ఇంటికి వచ్చి డబ్బులివ్వడం సంతోషమని, ఇప్పుడు తనకు బతకాలనే ఆశ ఉందని, తన కూతుర్ని కూడా బతికించుకుంటానని పేర్కొంది. శ్యామల ఖడ్గం, ఆంధ్రావాలా, బాబాయ్ హోటల్, గోలీమార్ వంటి సూపర్ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.