Kurnool, September 8: ప్రముఖ టాలీవుడ్ నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూశారు. మంగళవారం ఉదయం బాత్ రూంలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించాలనుకునే లోపే తుదిశ్వాస విడిచారు. జయప్రకాశ్‌రెడ్డి 1946లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల అనే గ్రామంలో జన్మించారు. చనిపోయే నాటికి ఆయన వయసు 74 ఏళ్లు. కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లపై నిషేధం ఉండటంతో, అప్పట్నించీ ఆయన గుంటూరు జిల్లాలో ఉంటున్నారు. ప్రతి వారం గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే నాటకాలకు జేపీ హాజరయ్యే వారు.
సినిమాల్లోకి నాటక రంగంతో తన నటనను ప్రారంభించిన జయప్రకాష్, ఆ రంగంలోనూ గొప్ప పేరు సంపాదించారు. ఏకధాటిగా 100 నిమిషాలు నిడివి ఉండే 'అలెగ్జాండర్' అనే నాటకాన్ని జయప్రకాష్ 66 సార్లు ప్రదర్శించారు. జేపీ తొలిసారిగా 1988లో 'బ్రహ్మపుత్రుడు' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. రాయలసీమ యాసలో తనదైన శైలిలో డైలాగ్స్ చెప్తూ ఆకట్టుకునే జయప్రకాష్ రెడ్డి దాదాపు అందరు అగ్ర హీరోలతో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థాయిని సాధించుకున్నారు.
ప్రేమించుకుందాం..రా, సమరసింహారెడ్డి, జయం మనదేరా, చెన్నకేశవరెడ్డి, సీతయ్య, ఛత్రపతి, గబ్బర్‌సింగ్, నాయక్, రేసుగుర్రం, టెంపర్, సరైనోడు సినిమాల్లో నటించారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటనలో అన్ని రకాల వేరియేషన్స్ చూపుతూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు.
జయప్రకాష్ రెడ్డి చివరగా నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాలో కూడా విలన్ ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో నటించిన ఆయన నాలుక మడతబెడుతూ ' వీడిని పండబెట్టి, పీకకోసి.. హుమ్.. హుమ్..' అని చెప్పే డైలాగ్ సినిమాకే హైలైట్.
జయప్రకాష్ రెడ్డి మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది, టాలీవుడ్ మరో మంచి నటుడ్ని కోల్పోయింది. జయప్రకాష్ రెడ్డి మరణం పట్ల సినీ, రాజకీయ, నాటక రంగ ప్రముఖులు మరియు ఆయన అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.