File image of Shobha Naidu | Twitter Photo

Hyderabad, October 14:  ప్రఖ్యాత కూచిపుడి నృత్యకారిణి శోభా నాయుడు (64) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. న్యూరాలజికల్ సమస్యతో బాధపడుతున్న ఆమె గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రాత్రి ఆమె పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. శోభా నాయుడు 1956 లో ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో ఆరంగేట్రం చేసిన ఆమె, గురువు వేంపతి చిన్న సత్యం వద్ద శిష్యురాలిగా చేరి శిక్షణ పొందారు.

చిన్నతనంలోనే కుచిపూడి యొక్క నైపుణ్యాన్ని అందిపుచ్చుకున్న శోభా, అప్పటి నుంచే డ్యాన్స్-డ్రామాల్లో ప్రధాన పాత్రలను పోషించడం ప్రారంభించారు.

సత్యభామ, పద్మావతి పాత్రల్లో ఎంతగానో మెప్పుపొందిన శోభా నాయుడు తన గురువు బృందంతో కలిసి దేశవిదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అంతేకాకుండా శోభ అద్భుతమైన సోలో డాన్సర్ కూడా. అనేక నృత్య-నాటకాలను కూడా ఆమె కొరియోగ్రాఫ్ చేసింది. యుఎస్, యుకె, దుబాయ్, టర్కీ, హాంకాంగ్, మెక్సికో, వెనిజులా, క్యూబా లాంటి దేశాల్లో ఎన్నో రంగస్థల ప్రదర్శనలు చేశారు.

హైదరాబాద్‌లోని 40 ఏళ్ల ప్రస్థానం గల కూచిపుడి ఆర్ట్ అకాడమీకి శోభా నాయుడు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. దేశవిదేశాలకు చెందిన సుమారు 1,500 మందికి పైగా విద్యార్థులకు ఆమె శిక్షణ ఇచ్చారు. కూచిపూడిలో శోభా నాయుడు చేసిన సేవలకు గానూ 2001లో భారత ప్రభుత్వం ఆమెను 'పద్మశ్రీ' పురస్కారంతో సత్కరించింది. 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది, దీనికి ముందు మద్రాసు శ్రీ కృష్ణ గణసభ ఆమెకు 'నృత్య చౌదమణి' అనే బిరుదును ప్రదానం చేసింది.

శోభా నాయుడు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషన్ తదితర ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.