Hyderabad, April 2: తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ (COVID-19 in Telugu States) విజృంభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ( (Andhra Pradesh) లో బుధవారం రాత్రి వరకు 67 కేసులు నమోదు కాగా గురువారం ఉదయం నాటికి మరో 21 కొత్త కేసులు పాజిటివ్ గా నిర్ధారించబడ్డాయి. దీంతో బుధవారం రాత్రి వరకు ఏపిలో 111గా ఉన్న కరోనా కేసులు గురువారం ఉదయం నాటికి 132కు చేరుకున్నాయి.
అత్యధికంగా గుంటూరులో 20, నెల్లూరులో 20 కేసులు నమోదుకాగా, ప్రకాశంలో 17, కడప మరియు కృష్ణా జిల్లాల నుంచి 15 చొప్పున, పశ్చిమ గోదావరిలో 14 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా అన్ని జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కూడా కరోనా కేసులు పెరగడానికి ముఖ్య కారణం 'మర్కజ్' వెళ్లి వచ్చిన వారి ద్వారానే అని గుర్తించబడింది. భారత్ కోవిడ్-19 రహిత దేశంగా ఎప్పుడు మారుతుంది?
ఇక తెలంగాణ (Telangana) విషయానికి వస్తే, రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 30 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 127కు పెరిగింది. అలాగే ఈ వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య తెలంగాణలో 9కి చేరింది. అంతకుముందు ఈ సంఖ్య 6గా ఉండగా బుధవారం నాడు గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు కరోనా వైరస్ సోకి మరణించారు.
అయితే కొత్తగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన ఈ 30 మంది మరియు చనిపోయిన ముగ్గురు కూడా మర్కజ్ (Nizamuddin Markaz) కు వెళ్లి వచ్చిన వారిగానే తేలింది. గతంలో మరణించిన ఆరుగురు కూడా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారే. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరి కొంత మందికి వైరస్ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్చార్జి కూడా అయ్యారు, అలాంటి వారిలో ఎవరి పరిస్థితి కూడా ఆందోళన కరంగా లేదు, ఎవరూ చనిపోలేదు. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణలో నమోదవుతన్న పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారివిగానే తేలాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం మర్కజ్ వెల్లి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నది, ఇంకా 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
మర్కజ్ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్న వారు ఇంకా ఎవరైనా వైద్య పరీక్షలు నిర్వహించుకోకుండా ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. అందరి ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇది వారికి, వారి కుటుంబానికి శ్రేయస్కరం కాబట్టి, మర్కజ్ వెళ్లి వచ్చిన ప్రతీ ఒక్కరు తప్పక పరీక్షలు చేయించుకోవాలి, అందుకు ప్రజలు సహకరించాల్సిందిగా సీఎం కేసీఆర్ కోరారు.