Vijayawada, August 6: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ http://bse.ap.gov.in తో పాటు ఇతర ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ల ద్వారా కూడా పొందవచ్చు. ఫలితాలతో పాటు మార్క్స్ మెమోలను కూడా ఈరోజే విడుదల చేశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల లాగిన్ వివరాలను ఉపయోగించి విద్యార్థుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ తెలిపారు.
కోవిడ్ కారణంగా గత రెండు విద్యాసంవత్సరాల్లో పబ్లిక్ పరీక్షలను నిర్వహించని సంగతి తెలిసిందే. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు 2020-21 విద్యార్థుల ఫలితాలు, గ్రేడ్‌లతోపాటు 2019-20 టెన్త్ విద్యార్థులకు గ్రేడ్‌లు కూడా టెన్త్ బోర్డ్ ప్రకటించింది. 2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించి సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు విడుదల చేశారు.
ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. పరీక్షలు లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ విద్యార్థికి సంబంధించి అన్ని విషయాలు పరిగణలీకి తీసుకొని గ్రేడ్లు కేటాయించంది తెలిపారు. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గ్రేడ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ఫార్మాటెవి, సమ్మెటివ్ అసెస్మెంట్ల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించబడ్డాయని, తద్వారా ఏ విద్యార్థికి నష్టం కలగదని మంత్రి స్పష్టం చేశారు.