Amaravati, June10: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు (AP SSC Result 2022) సంసిద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈమేరకు రాష్ట్రంలోని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీలు), జిల్లా విద్యాధికారులకు (డీఈవోలకు) పాఠశాలవిద్య కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ మార్గదర్శకాలు జారీచేశారు. రోజూ రెండు సబ్జెక్టులపై విద్యార్థులకు బోధన సాగేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ‘ఈనెల 6వ తేదీన ఫలితాలు విడుదలైన టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరైన 6,15,908 మంది విద్యార్థుల్లో 2,01,627 మంది ఫెయిలయ్యారు.
రెండేళ్లుగా కరోనా వల్ల పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన లేక విద్యార్థుల్లో అభ్యాస నష్టం వల్ల వారంతా ఫెయిలైనట్లు విశ్లేషణలో తేలింది. వీరికి జూలైలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షల్లో రాణించేలా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరముంది.
ఇందుకోసం సబ్జెక్టు, టాపిక్స్ వారీగా స్పెసిఫిక్ కోచింగ్‌ను చేపట్టాలి. ఈనెల 13వ తేదీనుంచి పరీక్షలు పూర్తయ్యేవరకు రోజుకు రెండు సబ్జెక్టుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలను రూపొందించాలి. విద్యార్థులతో సబ్జెక్టులను పునశ్చరణ చేయించాలి. వారు ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించేలా వారిని తీర్చిదిద్దాలి..’అని Andhra Pradesh Education Department అధికారి వివరించారు.
విద్యార్థులు, తల్లి దండ్రుల ప్రయోజనార్థం ఈ కోచింగ్ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ సంయు క్త సంచాలకులు, జిల్లా విద్యాధికారులు శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి సం బంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. రెమిడియల్ తరగతులు అవసరమైన స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. స్కూళ్ల వారీగా ప్రణాళికలను, టైమ్‌టేబుళ్లను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఏ టీచర్ ఏ సమయంలో స్కూల్‌లో ఆయా సబ్జెక్టులపై తర్ఫీదు ఇవ్వాలో కూడా జాబితా రూపొందించాలని సూచించారు. ఈ ప్రణాళికలను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌కు సమర్పించాలని నిర్దేశించారు.