Amaravathi, July 23: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిములాపు సురేష్ శుక్రవారం సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. మొత్తం 5,19,510 మంది విద్యార్థుల ఫలితాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ ఏడాది కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేసిన ఇంటర్మీడియట్ బోర్డ్, ద్వితీయ సంవత్సరం ఫలితాల కోసం విద్యార్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల్లో 30 శాతం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో సాధించిన ఫలితాల్లో 70 శాతం వెయిటేజీని కలిపి, సబ్జెక్టుల వారీగా మార్కులతో సరాసరి గ్రేడ్లను నిర్ణయించారు.
విద్యార్థులు తమ ఫలితాలను క్రింది వెబ్‌సైట్‌ల నుంచి పొందవచ్చు.
కాగా, ఈ ఫలితాలతో సంతృప్తి చెందని వారికి పరిస్థితులు అనుకూలించిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. జూలైలోపు ఫలితాలు వెల్లడించాలని అన్ని రాష్ట్రాల బోర్డులను సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో ఏపి ప్రభుత్వం నేడు ఇంటర్ ఫలితాలను ప్రకటించింది.
ఇదిలా ఉంటే, కరోనా నేపథ్యంలో గతేడాది ఎస్‌ఎస్‌సి పరీక్షలు నిర్వహించనందున వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని ఏపి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైతరగతికి ప్రమోట్ చేయడానికైనా మార్కులు కేటాయించాలంటే పరీక్షలు నిర్వహించడం అనివార్యమని అధికారులు భావిస్తున్నారు.