రాష్ట్రంలో విద్యకు పెద్ద పీట వేస్తున్న జగన్ సర్కారు (AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంను (English Medium) ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వం మరో దిశగా అడుగులేసింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రైమరీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతులను హైస్కూళ్ల పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ తరగతుల విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచేందుకు వీలుగా వారికి ఉన్నత బోధనను అందించేందుకు ఈ చర్యలు చేపట్టింది.
ఒకే ఆవరణలో ఉన్న లేదా 250 మీటర్ల లోపు దూరంలో ఉన్న ప్రైమరీ స్కూళ్ల 3, 4, 5 తరగతులను హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలోకి తీసుకురావాలని ఆదేశించింది. అలాగే 1, 2 తరగతుల విద్యార్థులకు ప్రైమరీ ఎస్జీటీలతో బోధన కొనసాగించి, ఇతర సీనియర్ ఎస్జీటీలను 3, 4, 5 తరగతుల బోధనకు వీలుగా సర్దుబాటు చేయనుంది. ప్రాథమిక తరగతుల్లో టీచర్, విద్యార్థులను 1:20 నిష్పత్తిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
విద్యార్థులకు నాణ్యమైన, సరళమైన బోధన అందేలా పాఠ్య పుస్తకాలను రూపొందించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. సచివాలయంలో ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకాల రూపకల్పనపై జరిగిన ప్రాథమిక సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర విద్యా రంగంలోని సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా బైలింగువల్ లాంగ్వేజ్‌లో రూపొందిస్తున్న పాఠ్యపుస్తకాలు భవిష్యత్తులో పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు.
అమ్మ ఒడి, నాడు–నేడు ఇంగ్లిష్ మీడియం విద్య తదితర పథకాలతో పేదలకు మెరుగైన విద్య అందుతోందన్నారు. సీబీఎస్‌ఈ సిలబస్‌కు తగ్గట్టుగా విద్యార్థులను సంసిద్ధం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో భాగస్వాములైన 13 జిల్లాలకు చెందిన దాదాపు 130 మంది రచయితలు, పాఠశాల విద్యా కమిషనర్ చిన వీరభద్రుడు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రిసెల్వి, ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.