AP Educational minister Adimulapu Suresh (Photo-Twitter)

Amaravati. Sep 29: ఏపీలో అక్టోబర్‌ 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా వాయిదా వేసినట్లు (AP Schools Reopening Postponed) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్‌ 2న స్కూళ్లు తెరవాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అయినప్పటికీ అక్టోబర్‌ 5న పిల్లలకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను ప్రభుత్వం అందజేయనుందని తెలిపారు. ఆ మేరకు అక్టోబర్‌ 5న జగనన్న విద్యా కానుక ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. వీలుంటే సీఎం వైఎస్‌ జగన్‌ ఏదైనా స్కూల్‌కు కూడా వెళ్తారని మంత్రి సురేష్‌ తెలిపారు.

కరోనావైరస్ లాక్ డౌన్ ( Coronavirus lockdown ) కారణంగా మార్చి నుంచి విద్యా సంస్థలు మూతపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పాఠశాలలను సెప్టెంబర్ 5 నుంచి పునఃప్రారంభించాలని తొలుత ఏపీ సర్కార్ భావించినట్టు వార్తలొచ్చినా కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రారంభించలేదు. తిరిగి అక్టోబర్ 5న పాఠశాలలను ప్రారంభిస్తామని తెలిపినా తమ నిర్ణయం ఏదైనా అన్‌లాక్ 5 మార్గదర్శకాలు ( Unlock 5 guidelines ) వెలువడిన తర్వాతే ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆ మేరకే తాజా పరిస్థితినిబట్టి మరోసారి ఏపీ సర్కార్ తమ నిర్ణయాన్ని మార్చుకుంది.

ఏపీలో అక్టోబర్ నెల‌లో రానున్న పథకాలు, స్పందన కార్యక్రమంపై అధికారులతో ఏపీ సీఎం వైయస్ జగన్ వీడియో కాన్పరెన్స్‌, కలెక్టర్లకు పలు సూచనలు

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 5,487 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 6,81,161కు చేరింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 6,78,266 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.గడిచిన ఒక్కరోజులో మరో 37 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 5,745 కు పెరిగింది.