Amaravati, Fe 2: కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఏపీలో ఇంటర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ (AP Inter Exams Time Table 2021) ప్రకటించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు 2021 (AP Inter Exams ) మే ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ సోమవారం తాత్కాలిక షెడ్యూల్ను విడుదల చేశారు.
కాగా గతేడాది సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనందున అప్పుడు ఫస్టియర్ పరీక్షలు రాసిన వారు ఈ పరీక్షల్లో ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకునేందుకు వీలు కల్పించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి ఆదివారాలు సహా ఏప్రిల్ 24 వరకు జరుగుతాయి.
ప్రతి రోజు రెండు సెషన్లలో.. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు జరుగుతాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పరీక్ష మార్చి 24న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష మార్చి 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. మే 5 నుంచి 22 వరకు ఫస్టియర్ విద్యార్థులు, మే 6 నుంచి 23 వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. దీనికంటే ముందు మార్చి 31 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
కరోనా ప్రభావంతో తరగతులు.. పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు నెలకొన్న నేపధ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు స్పందించింది. పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగవుతుండడంతో ఆన్ లైన్ క్లాసులతోపాటు.. నేరుగా కాలేజీలకు వెళ్లేందుకు అనుమతించారు.