కరోనా కారణంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూతబడిన విషయం తెలిసిందే. అయితే.. కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుండటంతో స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి.
ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు (AP Inter Clases) ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గత నెల 12 వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు (AP Inter Second Year Regular Classes) నిర్వహించాలని కళాశాల యాజమాన్యాలకి, ప్రిన్సిపాళ్లకి ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీచేసింది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు–2021 తేదీలు ఖరారయ్యాయి. ఈ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్ విద్యామండలి తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు.