Representational Image (Photo Credits: PTI)

Amaravati, Sep 26: ఏపీ పీజీ సెట్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పీజీ సెట్ కన్వీనర్ పీ శ్రీనివాసరావు (PG Set Convener P Srinivasa Rao) తెలిపారు. ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పీజీ సెట్ పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీజీ సెట్ (AP PGECET 2020) కోసం 13 పరీక్షలు మూడు రోజుల పాటు జరగనున్నాయని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పీజీ సెట్‌కు 28,726 మంది హాజరవుతున్నారని, వీరిలో పురుషులు 16,607, మహిళలు 12,119 మంది ఉన్నారని తెలిపారు.

ఉదయం పరీక్ష రాసే వారికి 8:30 నుంచి 10 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, మధ్యాహ్నం పరీక్ష రాసే వారికి 1:30 వరకు అనుమతి ఉంటుందని చెప్పారు. పరీక్ష ప్రారంభమైన తరువాత ఒక నిమషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్ష రాసే వారు మాస్క్ తప్పని సరిగా ధరించాలన్నారు.

రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్‌ 2020 (AP Emcet 2020) ప్రశాంతంగా ముగిసింది. ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు. ఈనెల 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి. 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్‌ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేయగా 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు.

అక్షరాస్యతలో అట్టడుగున ఏపీ, కేరళ నంబర్ వన్, రెండవ స్థానంలో ఢిల్లీ, అస్సాం కన్నా వెనుకంజలో తెలంగాణ రాష్ట్రం, గణాంకాలను విడుదల చేసిన నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌

ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్‌ విభాగం పరీక్షలు జరగ్గా మొత్తం 87,652 మందికి గాను 75,834 (86.52%) మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి సమాధానాల ప్రాథమిక ‘కీ’ని శనివారం విడుదల చేయనున్నారు. ఈనెల 28 వరకు అభ్యంతరాలను దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఉన్నత విద్యా ప్రవేశాలు ముగించి అక్టోబర్‌ నుంచి తరగతులు ప్రారంభించాలని యూజీసీ, ఏఐసీటీఈ క్యాలెండర్‌ను నిర్దేశించిన నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఏపీ ఎంసెట్‌ను ఉన్నత విద్యామండలి పూర్తి చేసింది.

రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ డిప్లొమాలో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం పాలిటెక్నిక్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్‌–2020) సెప్టెంబర్ 27న జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్టు సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎం.ఎం నాయక్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌ 2020 పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఫలితాలను ప్రకటించారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.ఎంబీఏ కోర్సును 352 కాలేజీలు అందిస్తుండగా ఎంసీఏ కోర్సును 130 కాలేజీలు నిర్వహిస్తున్నాయి.

ఎంబీఏలో 44084 సీట్లు, ఎంసీఏలో 8,558 సీట్లు ఉన్నాయి. ఇందులో కన్వీనర్‌ కోటాలో ఎంబీఏలో 31368 సీట్లు, ఎంసీఏలో 6,229 సీట్లు భర్తీ చేయనున్నారు. మిగతావి మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో భర్తీ కానున్నాయి. ఈసారి ఐసెట్‌ను శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించింది. గతేడాది కంటే ఈసారి పరీక్షకు అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ఈ నెల 30 నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఐసెట్‌ కన్వీనర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు.