Inter Exams 2021: పరీక్షల విషయంలో వెనక్కి తగ్గేదేలే! షెడ్యూల్ ప్రకారమే ఏపిలో ఇంటర్ పరీక్షలు, గురువారం నుంచే హాల్ టికెట్ల డౌన్‌లోడ్, విద్యార్థుల భవిష్యత్ కోసమేనని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పునరుద్ఘాటన
Representational Image (Photo Credits: PTI)

Amaravathi, April 29: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ఒకవైపు డిమాండ్లు వెలువెత్తుతున్న వేళ,  పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని, మే 5 నుంచి యధాతథంగా పరీక్షలు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిములాపు సురేష్ పునరుద్ఘాటించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇంటర్ పరీక్షలు అవసరమని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ మే 5 నుంచి 19 వరకు రాష్ట్రంలో ఇంటర్ ఎగ్జామినేషన్లు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటల నుండి విద్యార్థులు హాల్ టికెట్లను bie.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తుందని, ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి సురేష్ తెలిపారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా 1452 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరంతో పోల్చితే అదనంగా 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 146 పరీక్షా కేంద్రాలు ఉండగా, గుంటూరులో అత్యల్పంగా 60 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకు కోవిడ్ స్పెషల్ ఆఫీసర్‌ను నియమించినట్లు మంత్రి తెలిపారు. ప్రతి రోజు పరీక్ష కేంద్రాలు శుభ్రపరచబడతాయి మరియు ప్రతి పరీక్ష కేంద్రంలో థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేయబడుతుంది. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు.