Amaravati, Sep 18: ఏపీలోఇకపై అన్ని కళాశాలల్లోనూ తెలుగుకు బదులుగా ఆంగ్ల మాధ్యమాన్ని (English Medium in Degree Colleges) బోధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించినట్లు TOI తన కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలు రెండూ అందుబాటులో ఉండగా, ఇకపై ఇంగ్లిష్ ఒక్కటే అమలు కానుంది. అంతేకాదు, విద్యార్థులందరూ ఇకపై ఇంగ్లిష్ మీడియంలోనే (English medium education) ప్రవేశాలు పొందాల్సి ఉంటుందని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గతేడాది డిగ్రీ మొదటి సంవత్సరంలో మొత్తం 2,62,805 మంది ప్రవేశాలు పొందగా, వారిలో 25 శాతం మంది అంటే 65,701 మంది మాత్రమే తెలుగు మీడియంలో చేరారు. వీరిలోనూ ఎక్కువమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఉన్నారు. ఇప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయడంతో వీరంతా తెలుగులో చదివే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఉన్నత విద్యపై ఫిబ్రవరి 2న సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కళాశాలలు ఆంగ్ల మాధ్యమంలోనే కోర్సులను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి గతంలోనే ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం తెలుగు మాధ్యమంలో కోర్సులు నిర్వహిస్తున్న ప్రైవేటు కళాశాలలు (Andhra Pradesh degree colleges) మాధ్యమం మార్పునకు జూన్ నెల 18 నుంచి 28 వరకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది. ప్రతిపాదనలు సమర్పించకపోతే కళాశాలలు కోర్సులను నిర్వహించేందుకు వీలుండదని పేర్కొంది. విద్యార్థులకు ఇంగ్లీష్ లో పట్టు సాధించేందుకు అదనపు ట్రైనింగ్ పోగ్రాంలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. విద్యాశాఖ అధికారులు తెలిపిన దాని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారికే ఉద్యోగ అవకాశాలు ఎక్కువని కంపెనీలు ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకునే సమయంలో ఇంగ్లీష్ భాష మీద నైపణ్యం ఉందా లేదా చూస్తున్నారని తెలిపారు. అందువల్ల వారికి ఇంగ్లీష్ మీడియం అనేది తప్పని సరి అని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే స్కూళ్లలో కూడా ఏపీ సర్కారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. అయితే ఈ నిర్ణయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అది ఇంకా విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో అన్ని డిగ్రీ కాలేజిల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచింది.