Amaravati, Oct 16: ఏపీలో నవంబర్ 2వ తేదీ నుంచి స్కూల్స్ (Schools Reopening Date in AP) ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే నాలుగైదు నెలలుగా స్కూల్స్ ప్రారంభించలేకపోయామని చెప్పారు. ఇంటర్‌లో 30 శాతం సిలబస్ తగ్గించామని, అదే పద్ధతిలో హైస్కూల్ విద్యార్థులకు కూడా సిలబస్ కుదిస్తామని మంత్రి తెలిపారు. స్కూల్స్ ప్రారంభమయ్యేలోపు (Schools Reopening) విద్యా క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి సురేష్ (Education minister adimulapu suresh) స్పష్టం చేశారు.
ఒంగోలులో మంత్రి సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థపై ప్రభుత్వం (AP Govt) పోరాడాల్సిన పరిస్థితి దాపురించిందని… అయితే రాజ్యాంగ వ్యవస్థలపై ప్రభుత్వానికి పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థను తాము ప్రభావితం చేస్తున్నామని స్వయంగా ప్రతిపక్ష నేతలే చెబుతున్నారని, అది ఎవరో అందరికీ తెలుసునన్నారు. మరోవైపు రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయనేది కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ మాత్రమేనన్నారు.
గత ప్రభుత్వ హయాంలో తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేస్తే సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు చేశారన్న ఆరోపణలు వచ్చిన పోలీసులపై కూడా చర్యలు తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరు, ఎక్కడ, ఎవరిపై దాడులు చేసినా చట్టం పరిధిలో చర్యలు తీసుకుంటామని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌పై దాడి
గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌పై తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బత్తుల పూర్ణచంద్రరావు గురువారం రాత్రి దాడికి యత్నించాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ఉద్దండరాయునిపాలెంలోని తన ఇంటివద్ద నుంచి బయటకు వెళ్లేందుకు ఎంపీ కారులో బయల్దేరగా.. ఎదురుగా వచ్చిన పూర్ణచంద్రరావు తన బైక్‌ను అడ్డుపెట్టి అసభ్య పదజాలంతో దూషించాడు.
ఎవరని ప్రశ్నించగా దాడి చేసేందుకు మీదకు రావడంతో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అతనిని పట్టుకుని వెతగ్గా ఇనుప రాడ్డు బయటపడింది. ఇంతలో నిందితుడు సమీపంలోని అమరావతి జేఏసీ నాయకుడు పులి చిన్న ఇంట్లోకి పారిపోగా భద్రతా సిబ్బంది మళ్లీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎంపీ సురేష్ మాట్లాడుతూ.. దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునే లోగానే మద్యం మత్తులో ఉన్న పూర్ణచంద్రరావు తనపై దాడికి యత్నించాడని తెలిపారు.