Amaravati, Oct 16: ఏపీలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ (YV Subba Reddy tests positive for coronavirus) అయింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల నిర్వహించిన టీటీడీ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి (TTD chairman YV Subba Reddy) పాల్గొన్నారు. దీంతో ఆయనను కలిసిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 12న వైవీ సుబ్బారెడ్డి తల్లి జన్మదినం జరిగింది. ఆ వేడుకల్లోనూ ఆయన పాల్గొని తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు.
వైవీ సుబ్బారెడ్డికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే టీటీడీలో అర్చకులు, సిబ్బంది మహమ్మారి బారినపడ్డారు. 14 రోజులపాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉన్నందున శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్( Ap Endowment minister Vellampalli Srinivas ) మరోసారి అస్వస్థత పాలయిన సంగతి విదితమే. ఈసారి పరిస్థితి సీరియస్ కావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికు రెండోసారి కరోనా వైరస్ సోకింది.
గత నెలలో తిరుమలలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavalu ) మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) తో కలిసి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ సమయంలో అందరితో కలివిడిగా ఉన్నారు. అక్కడ్నించి వచ్చిన అనంతరంత కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజులకు పైగా ఉండి చికిత్స తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఆ తరువాత ఈ నెల 8వ తేదీన విజయవాడలోని పాఠశాల విద్యార్దులకు జగనన్న విద్యాకానుక అందించారు.
ఇప్పుడు మరోసారి అనారోగ్యం పాలయ్యారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా వైరస్ ( Coronavirus ) రెండోసారి సోకిందా అనే అనుమానం కలుగుతోంది. వైద్యులు ఇంకా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఈసారి పరిస్థితి కాస్త సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ నెల 17 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా మంత్రి వెల్లంపల్లి...ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కోరారు