School Kids. Representational Image (Photo credits: Pixabay)

Hyd, June 14: తెలంగాణలో నేటి నుంచి ప్రభుత్వ స్కూళ్లు ప్రారంభం (Schools Reopen in Telangana) అయ్యాయి. విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు లేకుండానే రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు (Telangana reopens schools) ప్రారంభమయ్యాయి. కొత్త పుస్తకాలు, యూనిఫాంల కోసం విద్యార్థులు నెల రోజుల పాటు వేచి చూసే పరిస్థితి కనిపిస్తోంది. పుస్తకాల ముద్రణ, యూనిఫాంలకు ఆదేశాలివ్వడంలో జరిగిన జాప్యమే ఇందుకు కారణం. దీంతో కొత్త పుస్తకాలు వచ్చే దాకా పాత పుస్తకాలతోనే విద్యార్థుల చదువు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. దీని ప్రకారం కింది తరగతి సబ్జెక్టులనే మరోసారి రివిజన్‌ చేయించనున్నారు.

దీని ప్రకారం.. ప్రస్తుతం ఐదో తరగతికి వచ్చిన విద్యార్థులకు కొత్త పుస్తకాలు వచ్చేదాకా నాలుగో తరగతి పాఠాలే మళ్లీ చెప్పనున్నారు. జులై నుంచి కొత్త తరగతి పాఠాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం (english medium in government schools) కూడా ప్రారంభించారు. సుమారు 26 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించాల్సి ఉంది. విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సుమారు 2.30 కోట్ల పుస్తకాలు అవసరం కాగా ఇప్పటిదాకా 40 లక్షల పుస్తకాలే జిల్లాలకు వెళ్లాయి. ప్రస్తుతానికి జిల్లా కేంద్రాలకు చేరుకున్న ఆ పుస్తకాలు ఇంకా పాఠశాలలకు చేరలేదు. ఇక, యూనిఫాంలు కూడా వచ్చే నెలలోనే విద్యార్థులకు అందే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కావడం లేదు, ఫేక్ వార్తలు నమ్మవద్దని కోరిన ఇంటర్ బోర్డు అధికారులు, అధికారికంగా స్పష్టత ఇస్తామని వెల్లడి

కాగా, పాఠ్యపుస్తకాల పంపిణీ సక్రమంగా నిర్వహించేందుకు కలెక్టర్‌ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన పని చేసే ఈ కమిటీకి జాయింట్‌ కలెక్టర్‌ వైస్‌ చైర్మన్‌గా ఉంటారు. డీఈవో, బీసీ సంక్షేమ, ట్రైబల్‌ వెల్ఫేర్‌, సోషల్‌ వెల్ఫేర్‌ మైనారిటీ వెల్ఫేర్‌ అధికారులు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, రెసిడెన్షియల్‌ అధికారులు సభ్యులుగా ఉంటారు. బడి బాట కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఇప్పటిదాకా సుమారు 79,635 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఇందులో 8,937 మంది సోమవారమే(13వ తేదీ) ప్రవేశాలు పొందారు. ఈనెల 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.