Representational Image (Photo Credits: PTI)

Hyderabad, May 24: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల రీషెడ్యూల్ తేదీలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSPSC) శనివారం ప్రకటించింది. తెలంగాణలో ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి 2020 ఏడాదికి గానూ వివిధ కామన్ ఎంట్రన్స్ టెస్టుల పరీక్షల రీషెడ్యూల్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జూలై 6 నుంచి 9వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఇతర అధికారులు సమావేశమై ప్రవేశ పరీక్షల తేదీలపై చర్చించి షెడ్యూల్‌ను ఖరారు చేశారు. కోవిడ్‌-19 నిబంధనలకు లోబడి, యూజీసీ ఇచ్చిన సలహాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతున్నామని సబిత వెల్లడించారు.

పరీక్షా తేదీల వివరాలు ఇలా ఉన్నాయి

జూలై 1న పాలిసెట్‌

జూలై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్‌

జూలై 4న ఈసెట్‌

జూలై 6వ తేదీ నుంచి 9 వరకు ఎంసెట్‌

జూలై 10న లాసెట్‌, లా పీజీసెట్

జూలై 13న ఐసెట్‌

జూలై 15న ఎడ్‌సెట్‌

ఈ ఏడాది ప్రవేశ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే న్విహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.