Hyderabad, August 26: తెలంగాణలో సెప్టెంబర్ ఒకటి నుంచి డిజిటల్ (ఆన్‌లైన్) విధానంలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలను (TS online Classes Time Table) జారీచేసింది. రాష్ట్రంలో విద్యార్థులకు డిజిటల్ విధానంలో పాఠాలు చెప్పే క్రమంలో అనుసరించాల్సిన విధివిధానాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన (School Education Director Sri Devasena) మంగళవారం విడుదలచేశారు.
ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో డిజిటల్ పాఠాలు (digital classes) అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రగ్యాత అనే పేరుతో విడుదలచేసిన మార్గదర్శకాలు ఎస్సీఈఆర్టీ వెబ్‌సెట్‌లో అందుబాటులో ఉన్నాయని విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు.దీంతో పాటుగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను అమలుచేయాల్సి ఉందన్నారు.
దీంతో పాటుగా డిజిటల్ పాఠాల బోధనలో ప్రధానోపాధ్యాయులకు కూడా మార్గదర్శకాలు జారీచేశారు. గురువారం నుంచి టీచర్లు, సిబ్బంది కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ-లెర్నింగ్ విధానాన్ని వెనకబడిన ప్రాంతాల విద్యార్థులందరికీ అందుబాటులో తేవాలని సూచించారు. నీట్ అడ్మిట్ 2020 కార్డు విడుదల, సెప్టెంబరు 1 నుంచి 6 వరకు జేఈఈ (మెయిన్స్) 2020 పరీక్షలు, సెప్టెంబరు 13న నీట్ 2020 పరీక్ష
విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం కిండర్‌గార్డెన్, నర్సరీ, ప్లేస్కూల్, ప్రీస్కూల్ విద్యార్థులకు గరిష్ఠంగా రోజూ 45 నిమిషాలకు మించకుండా వారానికి మూడ్రోజులు మాత్రమే బోధన జరగాలి. అదికూడా పెద్దలు లేదా తల్లిదండ్రుల సమక్షంలో జరుగాలని స్పష్టంచేశారు. ఇక ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రోజూ రెండు తరగతుల చొప్పున వారంలో ఐదు తరగతులకు మించి తీసుకోరాదని తెలిపారు. గరిష్ఠంగా ఒకటిన్నర గంటలే ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
6 నుంచి 8వ తరగతుల వారికి రోజుకు 30 నుంచి 45 నిమిషాలు మించకుండా మూడు సెషన్లలో క్లాసులు తీసుకోవాలని తెలిపారు. రోజుకు గరిష్ఠంగా రెండు గంటలే బోధించాలని పేర్కొన్నారు. 9-12వ తరగతి వరకు ఒక్కో క్లాసు 30-45 నిమిషాలకు మించకుండా.. నాలుగు సెషన్లలో బోధన సాగాలని, మొత్తంగా రోజుకు 3 గంటలు మించకూడదని ఆమె స్పష్టంచేశారు. తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్, కాలేజీలు ఓపెన్, ఆన్‌లైన్ ద్వారా విద్యాభోదన, అధ్యాపకులు,ఉపాధ్యాయులు ఈ నెల 27 నుంచే హాజరుకావాలని ఆదేశాలు
2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలు కల్పించడానికి ప్రభుత్వం అనుమతి కల్పించింది. పై తరగతులకు వెళ్లేవారి వివరాలు స్కూళ్లలో సిద్ధంగా ఉన్నాయి. అడ్మిషన్ల కోసం విద్యార్థులు భౌతికంగా స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ ద్వారానే ప్రవేశం పొందవచ్చు. బడి బయట పిల్లలను, వలస కార్మికుల పిల్లలను, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను కూడా గుర్తించాలి. వారికి కూడా డిజిటల్ బోధన కొనసాగించాలి. అడ్మిషన్ల వివరాలను సమగ్ర శిక్షా అభియాన్ వెబ్‌సైట్‌లో ఉన్న ‘ఛైల్డ్ ఇన్ఫో అప్లికేషన్'లో అప్‌లోడ్ చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు.