తెలంగాణలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా కొనసాగుతోంది. ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో జూన్ 20వ (TS Inter Results 2022) తేదీలోగా ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డ్ కృత నిశ్చయంతో ఉంది. మే 6వ తేదీన మొదలైన ఇంటర్మీడియెట్ పరీక్షలు (Inter Exams) మే 24న ముగిసిన విషయం తెల్సిందే.
ఈ సారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 4,64,626 మంది కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,42,768 మంది ఉన్నారు. అలాగే ఈ సారి 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి.., 25,530 మంది ఇన్విజిలేటర్లను, 150 మందితో సిట్టింగ్ స్క్వాడ్, మరో 75 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి పటిష్టంగా పరీక్షలను నిర్వహించారు. జూన్ 15 నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తరగతులు, జూలై 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసులు, అకడమిక్ షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూలై మొదటి వారంలో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా కరోనాతో విద్యా సంవత్సరంలో ఒడిదొడుకులు చోటుచేసుకున్న విషయం తెల్సిందే. అలాగే ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేశారు. అలాగే ఈ సారి ఇంటర్ పరీక్షల ప్రశ్నపత్రాలను 70 శాతం సిలబస్ నుంచి మాత్రమే ఇచ్చారు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గడంతో ఈసారి విద్యాసంవత్సరం సాధారణ సమయాల్లోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ ఇంటర్ బోర్డు వచ్చే విద్యా సంవత్సరం క్యాలెండర్ ను విడుదల చేసింది. జులై 1వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభమవుతాయి. జూన్ 15న ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. 2022-23 విద్యాసంవత్సరంలో మొత్తం 221 పనిరోజులతో ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను విడుదల చేసింది.