Hyderabad, February 24: తెలంగాణలో నేటి నుంచి 6 నుండి 8 వ తరగతి వరకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విద్యాశాఖతో సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్లు, డిఈఓలు, బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటి శాఖలకు సంబంధించిన జిల్లా సంక్షేమ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇప్పటికే 9 మరియు పదో తరగతి క్లాసులు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు 6 నుండి 8 వతరగతి వరకు క్లాసులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రంలో కోవిడ్19 వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు తరగతులకు హాజరయ్యే విషయమై తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని అధికారులకు ప్రభుత్వం సూచించింది. తరగతులకు హాజరయ్యేందుకు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి.
బుధవారం నుంచే తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ మార్చి 1 నుంచి పూర్తి స్థాయిలో తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 6 నుండి 8 వ తరగతులకు సంబంధించి మొత్తం 17.24 లక్షల మంది ప్రభుత్వ విద్యార్ధులతో పాటు ఇప్పటికే హాజరవుతున్న మిగతా విద్యార్ధులు కూడా ఉండనున్నారు.
6 నుండి 8 వ తరగతి విద్యార్థుల కోసం పాఠశాలలను చాలా కాలం తర్వాత ప్రారంభిస్తున్నందున జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి ఎడ్యూకేషన్ మానిటరింగ్ కమీటీలు సమావేశమై క్లాసుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉపాధ్యాయులు మరియు విద్యార్ధుల భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.