తెలంగాణలో కుండపోత వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎంసెట్ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షలను వాయిదా (TS EAMCET 2022 Postponed) వేస్తున్నట్టు ప్రకటించింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ఖరారు (new dates for Agriculture, Medical soon) చేస్తామని తెలిపింది.
అయితే, అదే సమయంలో ఈ నెల 18,19, 20 న జరగాల్సిన ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మాత్రం యథావిధిగా జరగనున్నాయని తెలిపింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి బుధవారం ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు.. 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ అర్హత పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ, వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలతో పలు జిల్లాల్లో ఇప్పటికీ ఎంసెట్ ఏర్పాట్లు (TS EAMCET 2022) ఇంకా మొదలే కాలేదు.
ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరవడం కష్టమవుతుందని, ఎంసెట్ ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను ఉన్నత విద్యా మండలి వాయిదా వేస్తూ నిర్ణయ తీసుకుంది. ఈ సారి ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి 1,71,945 మంది దరఖాస్తు చేసుకోగా.. అగ్రికల్చర్, మెడికల్‌కు 94,150 మంది పోటీ పడుతున్నారు.
ఇక భారీ వర్షాల నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సోమ, మంగళవారాల్లో జరగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణాధికారి పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు మధుకర్, ఎ.నరేందర్ ఆదివారం ప్రకటించారు. సోమవారం జరగాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 2న, మంగళవారం జరగాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సుల రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 3న, సోమవారం జరగాల్సిన బీసీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 13వ తేదీన, మంగళవారం జరగాల్సిన బీవో రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 21న, మంగళవారం జరగాల్సిన బీవో రెండో సెమిస్టర్ పరీక్ష ఈ నెల 21న, సోమవారం జరగాల్సిన బీవో నాలుగో సెమిస్టర్ పరీక్షను ఈ నెల 22న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది.