తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి సెషన్‌లో 28 వేల మంది విద్యార్థులు పరీక్ష (TS Eamcet Exams 2021) రాస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ అని అధికారులు ప్రకటించడంతో చివరి నిమిషంలో కూడా పరుగు పరుగునా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. కాగా.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.
ఆగస్ట్ 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు (TS Eamcet 2021) జరగనున్నాయి. తెలంగాణలో 82, ఏపీలో 23 సెంటర్లను ఏర్పాటు చేసినట్టు ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్ మీడియాకు వెల్లడించారు. ఎంసెట్‌కు మొత్తం 2లక్షల 51వేల 132 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో లక్షా 64వేల 678 మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులు, మెడికల్ అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్ అభ్యర్థులు 86వేల 454 మంది ఉన్నారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎంసెట్ పరీక్షలను (Telangana State Engineering Agriculture and Medical Common Entrance Test) అధికారులు నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే ముందు ప్రతి విద్యార్థి.. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని, మాస్క్, శానిటైజర్ తప్పకుండా తెచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. కోవిడ్ లక్షణాలు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక రూమ్‌లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు.