
కరోనావైరస్ కారణంగా 2021 విద్యా సంవత్సరానికి ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు (AP Open School Exams Cancelled) చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2021 జూలైలో బోర్డు పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన, నమోదు చేసుకున్న విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టుగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు రెగ్యులర్ విద్యార్థుల తరహాలోనే ఓపెన్ స్కూల్ విద్యార్థులనూ పాస్ చేస్తున్నట్టు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (Andhra Pradesh Open School Society) పోర్టల్‌లో అందుబాటులో ఉన్న వివరాల మేరకు పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్ పాయింట్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇంటర్ విద్యార్థులకు ఎస్ఎస్‌సీ మార్కులపై 30శాతం వెయిటేజీ, సన్నద్ధత కోసం నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కులపై 70శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ విద్యావిధానం అమలుపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. కాగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టతకు సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు.. అమలవుతున్న పథకాలను ఎమ్మెల్సీలు అభినందించారు.