Indian Army, Navy, Air Force Honouring COVID-19 Warriors (Photo Credits: ANI)

New Delhi, May 3:  కరోనావైరస్ మహమ్మారిని దేశం నుంచి తరిమేయడం కోసం పగలు, రాత్రి తేడా లేకుండా అహర్నిశలు శ్రమిస్తూ, రోజుల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసమే పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసులు మరియు శానిటరీ సిబ్బందికి అపురూపమైన గౌరవం దక్కింది. వారి నిస్వార్థ సేవలకు సేవలకు సంఘీభావంగా భారత త్రివిద దళాలు ఘనంగా గౌరవ వందనం సమర్పించాయి.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై సహా దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలలోని కోవిడ్-19 ఆసుపత్రులపై భారత వాయుసేన పూలవర్షం కురిపించింది. కరోనా పోరాట యోధులందరినీ బయటకు ఆహ్వానించి, హెలికాప్టర్ల ద్వారా వారిపై పూలు చల్లుతూ వందనాలు పలికింది. ఈ అపురూపమైన గౌరవానికి వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది ముగ్ధులై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే వృత్తిలో ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.

అలాగే ఈ కష్టకాలంలో జనాన్ని నిరంతరం జాగృతం చేస్తున్న మీడియా, ప్రజలను ఆదుకుంటున్న సామాజిక సేవకులు, ఆహారాన్ని సరఫరా చేస్తున్న డెలివరీ బాయ్స్ కూడా ఈ గౌరవాన్ని ఆస్వాదించారు.

At Gandhi Hospital in Hyderabad

తొలుత ఈ ఉదయం దిల్లీ పోలీస్‌ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి సమర్పరణతో త్రివిధ దళాల కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. పోలీసు సేవలకు ప్రశంసగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చాపర్‌ పోలీస్‌ వార్‌ మెమోరియల్‌పై పూలవర్షం కురింపించింది. దిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పట్టణాల్లో కోవిడ్‌ ఆసుపత్రులపై వాయుసేన పూలవర్షం కురిపిస్తున్నాయి. ఈ రోజంతా భారత త్రివిధ దళాలు కోవిడ్-19 వారియర్స్ కు సంఘీభావంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నాయి.

భారత ఆర్మీ గౌరవ సూచికంగా బ్యాండ్ కొడుతూ గౌరవ వందనాలు సమర్పిస్తుండగా, వాయుసేన హెలికాపటర్ల ద్వారా పూలవర్షం కురిపించింది. ఈరోజు సాయంత్రం 7:30 నుంచి అర్ధరాత్రి 11:59 వరకు ముంబై, కొచ్చి, చెన్నై, గోవా మరియు వైజాగ్‌తో సహా 25 తీర ప్రాంతాలలో ఇండియన్ నేవీ యుద్ధ నౌకలను, ఓడలను దీపాలతో అలంకరించి కరోనా వారియర్లకు సంఘీభావం ప్రకటించనుంది.

కాగా, త్రివిధ దళాల ఈ ప్రత్యేకమైన గౌరవ సంజ్ఞలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశసించారు. కఠిన సమయాల్లో సాయుధ దళాలు ఎల్లప్పుడూ ఎంతో మద్దతునిస్తున్నాయి. దేశం కోసం త్రివిధ దళాల సేవలు ఎంత గొప్పవో ప్రస్తుత సంక్షోభ సమయంలో కోవిడ్ వారియర్స్ కోసం వారు ప్రదర్శించిన సంఘీభావం కూడా అంతే గొప్పది అని ప్రధాని కొనియాడారు. ఈరోజు ప్రపంచ మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం బలమైన పోరాటం చేసిందంటే, అది మన సాహసోపేతమైన కోవిడ్-19 యోధుల వల్లే సాధ్యమయిందని ప్రధాని మోదీ అన్నారు.

ఇక కరోనాపై పోరాటంచేస్తున్న వారికోసం సంఘీభావం ప్రదర్శించాలనే నిర్ణయం తీసుకొని, ఇలాంటి అద్భుత కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలు చేసినందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరియు త్రివిధ దళాధిపతుల ముఖ్యులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అభినందనలు తెలిపారు.