Cyclone Jawad: మరో గండం..నేడు జవాద్ తుపానుగా మారనున్న వాయుగుండం, శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
Cyclone (Photo Credits: Wikimedia Commons)

Amaravati, Dec 3: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం (Depression over Bay of Bengal) వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాళాళాతంలో జవాద్‌ తుపానుగా (Cyclone Jawad) మారుతుందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఇది (Cyclonic Storm During Next 24 Hours) తరువాత వాయవ్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించి శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో 2రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45–65 కిలోమీటర్లు, శనివారం 70–90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్, మూడు రోజుల పాటు 95 రైళ్లు రద్దు, జవాద్ తుపాను నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న తూర్పు కోస్తా రైల్వే

జవాద్ తుపాను ప్రభావంతో పలు రైళ్లను అధికారులు రద్దు చేయనున్నారు. విజయవాడ రైల్వే డివిజన్ మీదుగా చెన్నైకి నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పలు రైళ్లను దారి మళ్లించారు. విజయవాడ-చెన్నై మధ్య తాత్కాలికంగా రైల్వే శాఖ రైళ్లను రద్దు చేసింది. ఉభయగోదావరి జిల్లాలకు అధికారులు తుపాను ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తుపాను దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా, డివిజన్‌ కేంద్ర కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా పర్యవేక్షించనున్నారు. రక్షణ, సహాయశాఖల అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

భయం గుప్పిట్లో ఉత్తరాంధ్ర, వణికిస్తున్న జవాద్ తుపాన్, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కలెక్టర్లను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గురువారం ఉదయం ఆయన వైఎస్సార్‌ జిల్లా పర్యటనకు వెళ్లే ముందు ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, సీఎంవో కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుపాన్‌ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. ఉత్తరాంధ్రలో తుపాను సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్‌ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్‌.అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాకు శ్యామలరావును నియమించారు. వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాను సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. తిరుపతిలోని కృష్ణానగర్‌ను సీఎం పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించి.. వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరద నష్టాలపై ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు. పంట, పశువులు నష్టపోయిన రైతులతో సీఎం జగన్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తిరుపతిలో వరద బాధితులతో సీఎం మాట్లాడనున్నారు. అలాగే పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తారు.