Monsoon | Representational Image (Photo Credits: Pixabay)

Southwest Monsoon entered in Telugu States: నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సహా సమీప ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఉత్తర కొన శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్‌ తదితర ప్రాంతాలపై ఉన్నట్టు ఇండియన్‌ మెట్రలాజికల్‌ డిపార్టుమెంట్‌ (ఐఎండీ) తెలిపింది. ఇక పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రవేశించాయని అధికారులు తెలిపారు.

రుతు పవనాలు కేరళను తాకిన తర్వాత ఏపీకి రావడానికి సాధారణంగా నాలుగు రోజుల సమయం పడుతుంది. ఈ నెల 8వ తేదీన అవి కేరళలో ప్రవేశించగా.. 12వ తేదీ నాటికి ఏపీకి వస్తాయని భావించారు. కానీ.. బిపర్‌జోయ్‌ తుపాను కారణంగా అవి చురుగ్గా కదలడంతో ఒకరోజు ముందుగానే ఏపీని తాకాయి. వచ్చే 48 గంటల్లో అవి రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలు, కోస్తాలోని పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. వారం రోజుల్లో మొత్తం రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రుతు పవనాల వల్ల ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది.

దక్షిణాది రాష్ట్రాలకు తప్పిన బిపర్‌జోయ్‌ ముప్పు, సౌతిండియాను వణికిస్తున్న తీవ్ర తుపాను, జూన్‌ 15వ తేదీన గుజరాత్‌ తీరాన్ని తాకనున్న సైక్లోన్

ఇక రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించే వరకు ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. అంటే మరో వారం రోజులపాటు పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత, వడగాలులు ఉండనున్నాయి. సోమవారం 134 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 220 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇదిలావుండగా ఆదివారం అనకాపల్లి జిల్లా అనకాపల్లి, కాకినాడ జిల్లా కరప, విజయనగరం జిల్లా జామిలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ జిల్లా పద్మనాభంలో 44.7, మన్యం జిల్లా భామిని, కోనసీమ జిల్లా శివలలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 86 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 110 మండలాల్లో వడగాల్పులు వీచాయి. మరోవైపు పలుచోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి.

కరోనా వ్యాక్సిన్ పొందిన భారతీయుల డేటా లీక్, సంచలన ఆరోపణలు చేసిన TMC అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే

ఇక కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి పవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్టు ఐఎండీ పేర్కొన్నది. నైరుతి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జాయ్‌ తుపాను రానున్న 24 గంటల్లో ఉగ్రరూపం దాల్చనున్నట్టు ఐఎండీ వెల్లచింది.

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. మిగతా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. అదే సమయంలో ఈ జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

మరోవైపు.. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఇదే సమయంలో వడగాల్పులు కూడా వీచే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేసింది.