Weather Alert: ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాల ముప్పు, నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం
Southwest Monsoon Withdraws (Photo-PTI/ Rep)

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా ఉన్న ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. వీటి ప్రభావంతో గురువారం కల్లా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణశాఖ (IMD) తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకుంటుందని పేర్కొంది.

వీటి ప్రభావంతో బుధవారం రాయలసీమ, దక్షిణకోస్తాలో అక్కడక్కడ మోస్తరు వానలు, ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు పడ్డాయి. రానున్న 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, శుక్రవారం దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం (Heavy rains expected for the next three days) ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

మళ్లీ ఇంకో అల్పపీడనం, నెల్లూరుతో సహా రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాల ముప్పు, ఈ నెలాఖరు వరకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ

ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిన్న మరోసారి సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో బుధవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని సీఎం పరిశీలించారు. నిత్యవసరాల పంపిణీ, వరద బాధిత కుటుంబాలకు అదనంగా రూ.2వేల పంపిణీ, సహాయ శిబిరాలు, విద్యుత్తు–తాగునీటి సరఫరా పునరుద్ధరణ, వైద్య–ఆరోగ్య శిబిరాలు, దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం, గల్లంతైన వ్యక్తుల ఆచూకీ, పశుదాణా పంపిణీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు.