Rains (Photo-Twitter)

Telugu States Weather Report: తెలుగు రాష్టాలను ఇప్పట్లో వర్షాలు వీడేలా కనిపించడం లేదు. మయన్మార్‌ తీరానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

దీనికి తోడుగా వాయవ్య మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న మరో ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర సముద్రతీర ప్రాంతాల వరకు, విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ అంతర్భాగంగా తూర్పు–పడమర ద్రోణి సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ఫలితంగా రానున్న మూడురోజులు కోస్తాంధ్రలో అనేకచోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి వరకు విజయనగరం, కోనసీమ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి.

తూర్పు లిబియాలో భారీ వరదలు.. 2 వేల మంది మృతి.. వేలాదిమంది గల్లంతు.. డ్యామ్ తెగడంతో డెర్నా నగరంలోకి వరద.. సముద్రంలోకి కొట్టుకుపోయిన జనం.. ఇళ్లు.. 10 అడుగుల మేర ముంచెత్తిన వరద

ఇక తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశమున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని సూచించింది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీంఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.

శుక్రవారం నుంచి శనివా రం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల పల్లి, ములుగు జిల్లాల్లో భారీ వానలు పడతాయని ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీచేసింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సా యంత్రం వరకు రంగారెడ్డి జిల్లాలో 9 సెంటీమీటర్లు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 7 సెంటీమీటర్లు, మెదక్‌ జిల్లాలో 5 సెంటీమీటర్లు, వికారాబాద్‌ జిల్లాలో 5 సెంటీమీటర్లు, నల్లగొండ జిల్లాలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.