![](https://test1.latestly.com/wp-content/uploads/2021/06/rains.jpg)
Hyd, Oct 28: ఈ శాన్య రుతుపవనాల ఆగమనంతో అక్టోబర్ 28 రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.ఈ అల్పపీడనం వాయుగుండం, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 29 నుంచి భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉంది.
నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసిన క్రమంలో.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది.ఈశాన్య రుతుపవనాల వర్షాలు ఆగ్నేయ భారతదేశ ద్వీపకల్పంలో (southeast peninsular India) అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాలు (Northeast monsoon) మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి.
సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడును అక్టోబర్ 20 లేదా అంతకు రెండు రోజులు అటుఇటుగా తాకుతాయి. కానీ, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఈ నెల 23 వరకు పూర్తి కాలేదు. ఇంతలో బంగాళాఖాతంలో ఏర్పడిన ‘సిత్రాంగ్’ తుపాను కూడా ఈశాన్య గాలులను నిలువరించడం ద్వారా రుతుపవనాల ఆలస్యానికి కారణమైంది.
నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశమంతటా వర్షాలు కురిపిస్తే ఈశాన్య రుతుపవనాలు మాత్రం దక్షిణ భారతదేశంలోనే ప్రభావం చూపుతాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల పాటు ఈ రుతుపవనాలు విస్తారంగా వర్షాలను కురిపిస్తాయి. ఈశాన్య రుతుపవనాల వల్ల కోస్తాంధ్రలో 338.1 మిల్లీమీటర్లు, రాయలసీమలో 223.3 మిల్లీమీటర్ల సాధారణ సగటు వర్షపాతం నమోదవుతుంది.
నైరుతి రుతుపవనాల సీజన్‌లో కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలోనే బంగాళాఖాతంలో తపానులు ఎక్కువగా ఏర్పడతాయి. వాటిలో అధికంగా దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడులపైనే ప్రభావం చూపుతాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజను (అక్టోబర్–డిసెంబర్‌ల మధ్య)లో కనీసం మూడు తుపానులు ఏర్పడుతుంటాయి. కానీ.. ఈ ఏడాది అంతకు మించి ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది ఇలావుండగా, సిత్రాంగ్ తుఫాను బంగ్లాదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. తుఫాను ప్రభావంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఈదురుగాలులు, వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో పలు ప్రాంతాల్లో అంధకారంలోకి వెళ్లిపోయాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. కాగా, సిత్రాంగ్ ప్రభావం భారత ఈశాన్య రాష్ట్రాలపైనా పడింది. అస్సాం, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో తుఫాను కారణంగా విమానాల రాకపోకలు కూడా ప్రభావితమయ్యాయి.