Weather Forecast: వాయుగుండంగా మారిన అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు రానున్న రెండు రోజులు భారీ వర్ష సూచన
Low pressure (Photo Credits: PTI)

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. అనంతరం ఉత్తర ఒడిశాకు ఆనుకుని పశ్చిమ, వాయవ్య దిశగా పశ్చిమ బెంగాల్‌ తీరం వైపు పయనించింది. ఆదివారం రాత్రికి జార్ఖండ్‌ వైపుగా వెళ్లి జంషెడ్‌పూర్‌కు 70 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.సోమవారం వరకు ఈ వాయుగుండం అదే దిశలో కదులుతూ.. అదే తీవ్రతను కొనసాగిస్తుందని ఐఎండీ తెలిపింది. వాయుగుండం జార్ఖండ్‌ వైపు మళ్లడంతో దాని ప్రభావం రాష్ట్రం పైన, ముఖ్యంగా ఉత్తరాంధ్రపై తగ్గిందని తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

వైరల్ వీడియో... అంతరిక్షంలో భారత జాతీయ పతాకం రెపరెపలు, భూమికి 30 కిలోమీటర్ల పైన మెరిసిన మువ్వన్నెల జెండా

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల మోస్తరు వర్షాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.ఆదివారం కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల్ జిల్లా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మ, మహబూబ్ బాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక సోమవారం ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.